చంద్రబాబు షాక్ తిన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని జనసేన, బీజేపీ నేతలు కలిసిపోయారు. అంతేకాదు, రెండు పార్టీలు కలిసి జగన్ ప్రభుత్వ దమనకాండపై పోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నాయి. ఇదంతా జగన్ ప్రభుత్వ చర్యల వల్లే సాధ్యమైంది. జనసేన, బీజేపీ నేతలకు సాధ్యం కానిదాన్ని, జగన్ నెరవేర్చడం విశేషం. ముఖ్యమంత్రికి ఆ రెండు పార్టీల నేతలు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని వుంటారు. మరోవైపు బీజేపీ, జనసేన ముఖ్య నేతలు సోము వీర్రాజు, పవన్‌కల్యాణ్ కలయిక చంద్రబాబుకు జీర్ణించుకోలేని పరిణామమే.
విశాఖలో గత మూడు రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలో రాజకీయ వేడి పుట్టించాయి. నోవోటెల్ హోటల్‌లో వుంటూ పవన్‌కల్యాణ్ సినిమాను తలపించేలా రాజకీయాలను రక్తికట్టించారు. కనీసం అభిమానులకు అభివాదం చేద్దామన్నా పోలీసులు అనుమతించలేదంటూ పవన్ నిస్సహాయతను వ్యక్తం చేశారు. చివరికి ఆయన విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. విజయవాడ నోవోటెల్‌లో హోటల్‌లో ఉంటున్న పవన్‌కల్యాణ్‌ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలుసుకున్నారు.
విశాఖలో తలపెట్టిన జనవాణిలో పాల్గొనేందుకు వెళ్లగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని బీజేపీ నేతలతో పవన్ చెప్పారు. కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన వాపోయారు. పోలీస్ అధికారులు తనను నిర్బంధించారని ఆయన బీజేపీ నేతలకు ఫిర్యాదు చేశారు. మిత్రపక్షమైన తనను కాదని పక్క చూపులు చూస్తున్న పవన్‌కల్యాణ్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ భావించింది.
విశాఖలో జనసేన కార్యకర్తల అరెస్ట్‌ను పైకి ఖండిస్తున్నట్టు నటించిన బీజేపీ, లోలోన సంబరపడుతోంది. రాజకీయంగా పవన్‌కు అనుభవలేమి, అవగాహన రాహిత్యం ఏ స్థాయిలో ఉందో విశాఖ ఎపిసోడ్‌తో బీజేపీ పసిగట్టింది. పవన్‌కు మద్దతుగా ఏపీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు సినిమాల్లో జనసేనానికి మించి నటించారు. చంద్రబాబుకు పవన్‌ను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇదే అదునుగా భావించి పవన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించడం గమనార్హం.
అనంతరం పవన్‌కల్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పవన్‌కు ఎదురైన చేదు అనుభవాలను బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను తీవ్రంగా ఎదుర్కోవాలంటూ తమకు కేంద్ర నాయకత్వం సూచించిందని వీర్రాజు తెలిపారు. పనిలో పనిగా పవన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలు. రైతుల సమస్యలపై రాష్ట్రంలో నిరంతరం పోరాటం చేస్తున్నారని అభినందించారు. అలాంటి ప్రజానాయకుడితో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆయన తప్పు పట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ దమనకాండపై పోరాటానికి త్వరలో జనసేనతో కలిసి కార్యాచరణ రూపొందించుకుంటాం అని అసలు విషయాన్ని ఆయన మీడియా సమక్షంలో ప్రకటించడం విశేషం. 2024 ఎన్నికలకు సోము వీర్రాజు నాయకత్వంలోనే వెళ్తామని ఇటీవల ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోదర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని వీర్రాజు పదేపదే చెబుతున్నారు.
విశాఖ తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కలిసి వెళ్లక తప్పనిసరి పరిస్థితి పవన్‌కు ఎదురైంది. ఏపీ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిందనే కక్షతో బీజేపీతో కలిసి పోరాటానికి పవన్ శ్రీకారం చుట్టే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పవన్ నుంచి బీజేపీ కోరుకుంటున్నది కూడా. కాగల కార్యం గంధర్వులు తీర్చారనే చందంగా… బీజేపీ, జనసేనలను జగన్ కలపారంటే కాదనగలరా? తాజా పరిణామాలన్నీ జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయా? అని టీడీపీ అనుమానిస్తోంది. ఎందుకంటే బీజేపీ, జనసేన కూటమిగా, తాను వేర్వేరుగా పోటీ చేస్తే… మళ్లీ జగనే సీఎం అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. పరిస్థితులను గమనిస్తే చంద్రబాబు భయమే నిజమయ్యేలా వుంది.