బీజేపీ, జనసేన మధ్య రాజకీయ సంబంధం భలే విచిత్రంగా వుంది. వీళ్లిద్దరి మధ్య పొత్తు ఎలా వుందంటే… విడాకులు తీసుకోకుండా, విడివిడిగా ఉంటున్న దంపతుల సంసారాలు చేస్తున్నట్టుగా. ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేనతో రాజకీయ సంబంధాలపై ఆయన ఆసక్తికర విషయాలు చెప్పడం విశేషం.
ప్రధానంగా 2024 ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడంపై సమావేశంలో చర్చించామన్నారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ పాలనపై ప్రజా చార్జిషీట్ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి విస్తృతంగా పర్యటిస్తారన్నారు. ఈ నెల 23న రాయలసీమ, 25న కోస్తాంధ్ర, 26న రాజమండ్రి, 27న విశాఖలో పర్యటించి ముఖ్య నేతల సమావేశాల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. రాబోయే 9 నెలల్లో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీపై దుష్ప్రచారాన్ని పోగొట్టేలా కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి నాయకత్వంలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. బీజేపీతో పవన్‌కు సంబంధం లేదని దుష్ప్రచారం చేశారన్నారు.
ఈ నెల 18న ఎన్డీయే సమావేశానికి పవన్‌ను ఆహ్వానించడం ద్వారా దుష్ప్రచారానికి చెక్ పెట్టినట్టైందన్నారు. బీజేపీ, జనసేనలపై తప్పుడు ప్రచారం చేసిన వారికి తమ ఆహ్వానం ఒక కనువిప్పు అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలమైన రాజకీయ శక్తిగా రాబోతున్నాయన్నారు. పొత్తుల అంశాన్ని జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. వారాహి యాత్రను బీజేపీ స్వాగతిస్తోందన్నారు.
జనసేన, బీజేపీకి రాజకీయ వ్యూహం ఉందని చివర్లో విష్ణువర్ధన్‌రెడ్డి జోక్ పేల్చారు. వాలంటీర్లపై పవన్ కామెంట్స్‌కు సంబంధించి హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించడం ద్వారా… జనసేనానికి బీజేపీ బాగానే బిస్కెట్లు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాలంటీర్లకు సంబంధించి కేంద్ర నిఘా సంస్థ తమకు కాకుండా జనసేనానికి చెప్పిందనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో…. బీజేపీ నేతలు ఏ మాత్రం సిగ్గుపడకపోవడం గమనార్హం.