టీడీపీతో పొత్తుకు తొందర ఎందుకని జనసేనాని పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఢిల్లీ అధిష్టానం ప్రశ్నించింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా ఇప్పటి నుంచి ఎందుకు హడావుడి పడుతున్నారని అడిగింది. టీడీపీ – జనసేన తమ పొత్తుపై త్వరలో ప్రకటన చేస్తాయని సమాచారం రావడంతో పవన్ ను అధిష్టానం ఢిల్లీకి రప్పించింది. ఆయన కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. టీడీపీ -జనసేన కలవకుండా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని చెప్పుకోవచ్చు. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి ఎటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు.
అయితే చంద్రబాబు, పవన్ కలయికతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానానికి వార్తలు రాష్ట్ర నాయకత్వం చేరవేయడంతో పవన్ కల్యాణ్ తో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సోము వీర్రాజు బీజేపీ పెద్దలను కలిశారని జనసేన నాయకులు అంటున్నారు. అయితే తాను రోడ్ మ్యాప్ అడిగినప్పటికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో తన వ్యూహం మార్చుకుంటున్నానని పవన్ ప్రకటించారు. అయినప్పటికీ తాను బీజేపీకీకి కానీ, మోడీకి కానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపిన బీజేపీ పెద్దలు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఆరు నెలల ముందు ఏ నిర్ణయమైన తీసుకోవచ్చని, అలా కాకుండా ఇప్పుడే టీడీపీతో చేతులు కలిపితే ప్రజల్లో చులకనవుతామని, అప్పుడు నిర్ణయం తీసుకుంటే మేలని చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పవన్ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే పొత్తులకు కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. కొంతకాలం నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రజాప్రతినిధుల వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీని ఓడిస్తానని, బుద్ధి చెబుతానని హెచ్చరించారు. విజయవాడలో చంద్రబాబు నేరుగా పవన్ ను కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన పరిణామాలన్నీ బీజేపీని తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి.
పవన్- చంద్రబాబు భేటీ తర్వాత బీజేపీ స్పందించింది. విశాఖ ఘటన తరువాత చంద్రబాబు పవన్ ను పరామర్శించడాన్ని సోము వీర్రాజు ఆహ్వానించారు. ఆ తర్వాత సోముతో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే పోటీ చేస్తామని, పవన్ తో తమ సంబంధాలు యథాతథంగా ఉంటాయని, ఇలా నిత్యం పవన్ కు తాము దగ్గరగానే ఉంటున్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ అడిగిన వైసీపీ వ్యతిరేక రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతాడులే అని నిర్లక్ష్యం చేసిన బీజేపీ ఇప్పుడు సడన్ గా ఆయనపై నిత్యం అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది.
అదే సమయంలో చంద్రబాబుతో ఈ మధ్య కలిసినట్లే కలిసి ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో విమర్శలకు దిగుతోంది. అదే సమయంలో చంద్రబాబుతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు లేదు.. కేవలం జనసేన-బీజేపీ పొత్తు మాత్రమే కొనసాగుతుందని పదే పదే చెప్తున్నారు. అంతే కాదు చంద్రబాబు గతంలో తమకు చేసింది మర్చిపోలేదని, విశాఖలో పవన్ పై దాడిని నిరసిస్తున్న చంద్రబాబు.. గతంలో తాను అమిత్ షాపై రాళ్లు వేయించింది మర్చికూడదంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందంటూ మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఇన్నాళ్లూ తాము సహకరించినా, సహకరించకపోయినా, కలిసి వెళ్లకపోయినా మౌనంగా కలిసి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి టీడీపీ తమవైపు తిప్పుకుంటోందనే ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు ఇప్పుడు తాజా పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పవన్ తో పొత్తుకు సిద్దమవుతున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.