బీజేపీ ఏపీ విషయంలో ఏమి చేస్తుంది అంటే ఎవరికీ అంతుబట్టడంలేదు. పొత్తు జనసేనతోనే ఉంటుందా లేక టీడీపీతో కూడా జత కూడుతుందా అంటే చెప్పనేని వాతావరణం ఉంది. ఎవరితోనూ పొత్తులు లేవు అంటే సింగిల్ గా పోటీ అని చెబుతుందా అన్నది ధర్మ సందేహంగా ఉంది.
ఎన్నికలు దగ్గరకు వచ్చిపడిన పరిస్థితులలో బీజేపీ ఏ సంగతీ తేల్చకపోతే ఎలా అని కమలనాధులు కలవరపడుతున్నారు. అయితే విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాత్రం సీటు చూసుకుని ప్రచారంలోకి దిగిపోయారు. పొత్తులు ఉన్నా లేకపోయినా నేనే పోటీ అని ఆయనకు ఆయనే డిసైడ్ అయినట్లుగా ఉన్నారు.
ఆయన మంచి ముహూర్తం చూసుకుని దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టి ప్రచారంలోకి దిగిపోయారు. ఎన్నికలు అయ్యేంతవరకూ ప్రచారం ఆగదు అని మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అంటున్నారు. ఆయన చాలా కాలంగా బీజేపీ టీడీపీ కలవాలని మొత్తుకుంటున్నారు. ఆయనకు అపుడు సీటు దక్కుతుంది. గెలుపు సులువు అవుతుంది అని ఆశిస్తున్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వం ఇంకా తర్జన భర్జన పడుతోంది. దాంతో రాజు గారు ఇక లాభం లేదని తానే అభ్యర్ధిని అని ప్రకటించుకుని రంగంలోకి దిగిపోయారు. బీజేపీలో అలా తొలి క్యాండిడేట్ ఆయనే అని చెప్పాలి. బీజేపీలో అభ్యర్ధుల ఎంపిక అంతా ఢిల్లీ నుంచే సాగుతున్నది.
అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో కూడా పోటీ చేసి ఓడిన రాజు ఈసారి తానే అభ్యర్థి అని భావిస్తున్నారు. ఆయన సీటులో ఎవరూ పోటీ లేరని కూడా అనుకుని బరిలోకి దిగుతున్నారు. బీజేపీ పొత్తులు లేవంటే కూడా రాజు గారు ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తారా అన్నది ఒక డౌట్ గా వ్యక్తం చేసే వారు ఉన్నారు.
బీజేపీ విషయం అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేయాలని చూస్తున్నట్లుగా అంటున్నారు అదే జరిగితే జనసేన విశాఖ ఉత్తరం సీటు కోరుతుంది. అపుడు రాజు గారు ఎలా రియాక్ట్ అవుతారో అని రెండు పార్టీలలో చర్చించుకుంటున్నారు.