టీడీపీతో జనసేన అక్రమ సంబంధమే పవన్‌కల్యాణ్ కొంప ముంచిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తనతో పొత్తు కుదుర్చుకుని, టీడీపీతో పవన్ మానసికంగా అంటకాగుతున్నారనే ఆగ్రహం బీజేపీ నేతల్లో వుంది.
అందుకే తమతో జనసేనాని ఉన్నా, లేకపోయినా ఫర్వాలేదనే తెగింపు బీజేపీలో రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే పవన్‌కల్యాన్ డిమాండ్లకు బీజేపీ తలొగ్గడం లేదు. అసలు పవన్‌కల్యాణ్ అనే నాయకుడిని పట్టించుకునే పరిస్థితి లేదని… ఆయన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా బీజేపీ చెప్పకనే చెప్పింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటన నేపథ్యంలో జనసేన తన డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తమ నాయకుడు పవన్‌కల్యాణ్ పేరు ప్రకటించాలని, అది కూడా నడ్డా పర్యటనలోనే జరిగిపోవాలనే కండీషన్స్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ పొత్తుల గురించి నేతలెవరూ మాట్లాడొద్దని జేపీ నడ్డా రాష్ట్ర నేతలను ఆదేశించారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ పరిణామాల్ని జనసేన ఊహించలేదు. తాము లేనిదే బీజేపీకి దిక్కులేదనే భావన జనసేనలో ఉంది. అందుకే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ అని కూడా లెక్కలేకుండా, ఆ పార్టీలో సీఎం అభ్యర్థులెవరూ లేరని, కాబట్టి పవన్‌ను ప్రకటించాలనే అపరిపక్వ డిమాండ్లు జనసేన నుంచి వచ్చాయి.
ముఖ్యంగా జనసేనాని నిజాయతీగా మెలగకపోవడంతో ప్రస్తుతానికి పక్కన పెట్టాలనే కోణంలో బీజేపీ ఆలోచిస్తోంది. దాని పర్యవసానమే ప్రస్తుతం జనసేన కోరుకున్నట్టు జరగకపోవడానికి కారణమైంది.