టీడీపీ అంటే బీజేపీకి మరీ లెక్కలేని తనం ఎక్కువైంది. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతోందని, మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా వుండాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ వైఖరి చూస్తుంటే కొన్ని ప్రాంతీయ పార్టీలను అసలు ఖాతరు చేయడం లేదు. ముఖ్యంగా టీడీపీపై బీజేపీ ఆగ్రహంగా ఉన్నట్టే కనిపిస్తోంది.
ఈ నెల 18న నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీని ఆహ్వానించినట్టు ఆ పార్టీని భుజాన మోసే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక ఏపీలో 2014 ఎన్నికల్లో మాదిరిగా మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకోనున్నాయని విస్తృతంగా ప్రచారం చేశారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు టీడీపీకి ఆహ్వానమే నిదర్శనమంటూ ఏవేవో కబుర్లు చెప్పారు.
అయితే బీజేపీతో టీడీపీ పొత్తుపై పౌర సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అబ్బే… తమకు ఎలాంటి ఆహ్వానం లేదని టీడీపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే సందర్భంలో బీజేపీ సీనియర్ నాయకుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ తమ మిత్రపక్షం కాదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆహ్వానం పంపామన్నారు. ఏపీలో జనసేనతోనే తమ పొత్తు వుంటుందని ఆయన చెప్పారు. టీడీపీతో పొత్తు బీజేపీ హైకమాండ్‌దే అని అన్నారు.
నిజానికి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం సాహసమే. రాజకీయంగా నష్టపోవడానికి కూడా సిద్ధమై బీజేపీతో రాజకీయ అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు సిద్ధమైన టీడీపీని ఛీత్కరించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీని కనీసం పరిగణలోకి తీసుకోలేదనేందుకు బీజేపీ నేతల పెదవి విరుపు మాటలే నిదర్శనం.