ఒకే సారి ముగ్గురితో రొమాన్స్‌!

ఒకేసారి ముగ్గురు, న‌లుగురితో ప్రేమ ప్ర‌యాణించ‌డం సాగించ‌డాన్ని స‌హ‌జంగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ రాజ‌కీయాల్లో కూడా అది సాధ్య‌మ‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నిరూపించింది. ఏపీకి చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు…

ఒకేసారి ముగ్గురు, న‌లుగురితో ప్రేమ ప్ర‌యాణించ‌డం సాగించ‌డాన్ని స‌హ‌జంగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ రాజ‌కీయాల్లో కూడా అది సాధ్య‌మ‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నిరూపించింది. ఏపీకి చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు వైఎస్ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌తో బీజేపీ ఒకేసారి రొమాన్స్ చేయ‌డం విశేషం. బ‌హుశా ఇలాంటి రాజ‌కీయ ప‌రిస్థితి దేశంలో మ‌రెక్క‌డా ఉండ‌క‌పోవ‌చ్చు.  

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌టికొచ్చింది. నాటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోదీ అంతు చూసే వ‌ర‌కూ నిద్ర‌పోన‌ని చంద్ర‌బాబు ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. అలాగే ఏపీకి పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చింద‌ని మోదీ స‌ర్కార్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌ను టార్గెట్ చేశారు. బీజేపీని మాట మాత్రం కూడా అన‌లేదు. ఎందుకంటే ఏపీలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థి బీజేపీ కాద‌ని ఆయ‌న‌కు బాగా తెలుసు.

ఏది ఏమైతేనేం మ‌రోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఏపీలో టీడీపీ ఘోర ప‌రాజాయ‌న్ని మూట‌క‌ట్టుకుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. క‌నీసం జ‌నసేనానిగా అసెంబ్లీలో కూడా అడుగుపెట్ట‌లేని ద‌య‌నీయ స్థితి.  దీంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో వ‌ణుకు పుట్టింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే … ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రుగునా వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో అన్ని పార్టీల‌కు అవ‌స‌రం ఏర్ప‌డింది. మోదీ స‌ర్కార్ అనుగ్ర‌హం లేక‌పోయినా, ఆగ్ర‌హానికి గురి కాక‌పోతే… అదే ప‌దివేల‌ని ముఖ్యంగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌ను చంద్ర‌బాబు క‌లుసుకున్నారు. పొత్తులపై విస్తృత‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఒక‌వేళ ఏపీలో ప్రాంతీయ పార్టీల‌తో బీజేపీకి పొత్తులు కుద‌ర‌క‌పోయినా, ఆ పార్టీకి న‌ష్ట‌మేమీ లేదు. ప్రాంతీయ పార్టీల‌ను బీజేపీ ప్ర‌త్య‌ర్థులుగా, శ‌త్రువులుగా భావించినా, ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్షాలు మాత్రం బీజేపీని అలా చూడ‌డం లేదు. ఎప్ప‌టికీ బీజేపీ అనుకూల పార్టీలుగానే మెల‌గ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే బీజేపీ ఒకేసారి మూడు పార్టీల‌తో రొమాన్స్‌లో ఉంద‌నే విమ‌ర్శ సోష‌ల్ మీడియాలో వెల్లువెత్త‌డం.