నిజానికి చీపురుకట్ట పార్టీ అంటే వారికి శత్రువు. కానీ.. వారు మాత్రం చీపురుకట్ట రాజకీయాలనే ప్రస్తుతం నడిపిస్తున్నారు. స్వీప్ చేయాలని అనుకుంటున్నారు. చీపరుకట్టతో ప్రత్యర్థి పార్టీలను ఊడ్చిపారేసే రాజకీయాలకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బిజెపిని వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారం దక్కించుకునే స్థాయికి బలోపేతం చేయాలని లెక్కలు వేస్తున్న పార్టీ నాయకులు రకరకాల తాయిలాలతో ప్రత్యర్థి పార్టీలనుంచి వలసలను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. ప్రత్యేకించి ముఠాకుమ్ములాటలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసే ఆలోచనతో రాజకీయం నడుపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తాజాగా మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ అయిన తర్వాత.. తెలంగాణలో కమిటీల ఏర్పాటు అనేది ఇప్పుడు ఆ పార్టీకి ముసలంగా పరిణమించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో రేవంత్ కోటరీ మినహా.. నాయకుడిగా గుర్తింపు ఉన్న ప్రతిఒక్కరూ ఇప్పుడు పార్టీ మీద తమ అసంతృప్త గళాలను వినిపిస్తున్నారు. పార్టీ తమను సంప్రదించకుండానే కమిటీలు వేసిందని, కమిటీల కూర్పు ఏకపక్షంగా ఉన్నదని రెచ్చిపోతున్నారు. పార్టీకి ఎంతో కాలంగా విధేయులు అయిన ఎందరో నాయకులు.. ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎత్తుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అసంతృప్త నేతలందరినీ తమలో చేర్చుకోవడానికి కమలదళం కీలకంగా పావులు కదుపుతోంది.కాంగ్రెసులోని అయిదారుగురు సీనియర్లతో పార్టీ మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ ముగ్గురు సీనియర్ నాయకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగర శివార్లలోని ఓ ఫాంహౌస్ లో భేటీ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అలాగే మరో ఇద్దరు సీనియర్లతో డికెఅరుణ ఫోనులో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉండడం కమలదళానికి ఎడ్వాంటేజీ అవుతోంది. ఇప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి రాగల సూచనలు లేనేలేవని కమలనాయకులు వారితో మైండ్ గేమ్ ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతుందని.. అందరూ కలిసి వస్తే.. అధికారంలోకి కూడా వస్తుందని.. ఆ నాయకులను ఆహ్వానిస్తున్నారు. బిజెపిలో మాత్రమే భవిష్యత్తు ఉంటుందని, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అంతర్ధానం అయిపోతున్నదని వారు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసే రాజకీయ ఎత్తుగడలతో కమలదళం వ్యవహరిస్తోంది.
పూర్తిగా పార్టీని ఊడ్చేయడం కాకపోయినప్పటికీ.. భారాస నుంచి కూడా.. పలువురిని చేర్చుకునేందుకు బిజెపిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కారణంగా ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి.. మరింత గుంభనంగా వ్యవహరిస్తూ.. భారాస ఎమ్మెల్యేలను కొందరిని పార్టీలో చేర్చుకోబోతున్నదని తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా అయిదుగురు ఎమ్మెల్యేలు భేటీ కావడం వెనుక కూడా కమలనాయకులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. చూడబోతే.. తెలంగాణ రాజకీయాల్లో బిజెపి చాలా వేగంగా స్వీప్ పాలిటిక్స్ నడిపిస్తున్న వైనం అర్థమవుతుంది.