యువ నాయకుడు నారా లోకేశ్‌కు టీడీపీలో ప్రత్యేకంగా ఒక వర్గం వుంది. వీళ్లలో ఎక్కువగా యువ నాయకులే ఉన్నారు. లోకేశ్‌ను అడ్డు పెట్టుకుని టికెట్ తెచ్చుకోవచ్చనే ధీమాలో వున్నారు. అయితే రాబిన్ శర్మ సర్వే నివేదికలు మాత్రం అలాంటి వారిలో కొందరికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డిపై రాబిన్ శర్మ టీమ్ కీలక రిపోర్ట్ ఇచ్చినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందింది.
క్షేత్రస్థాయిలో బొజ్జల సుధీర్‌రెడ్డికి జనంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లేదని రాబిన్ శర్మ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. బొజ్జల సుధీర్ జనంలో తక్కువ, హైదరాబాద్‌లో ఎక్కువ అనే అభిప్రాయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలంగా ఉంది. వాస్తవం కూడా ఇదే. సుధీర్‌రెడ్డి కేవలం తన తండ్రి పేరుతో రాజకీయాల్లో రాణిస్తామనే భ్రమల్లో ఉన్నారు. గత నాలుగేళ్లలో ఆయన నెలలో కనీసం వారం రోజులు కూడా గడిపిన దాఖలాలు లేవు.
సాధారణ ప్రజలకు బొజ్జల సుధీర్‌రెడ్డి అందుబాటులో వుండడం పక్కన పెడితే, కనీసం సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన దొరకడం లేదనే విమర్శ వుంది. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంపై కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బొజ్జలకు చంద్రబాబు చీవాట్లు పెట్టినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. శ్రీకాళహస్తిలో వుంటూ ప్రజల్లో అభిమానం పెంచుకుంటే తప్ప, తానేం చేయలేనని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో కొంత కాలంగా బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నారు. ఎందుకో గానీ ఆయనకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ నేపథ్యంలో బొజ్జలకు టికెట్ ఇస్తే, మరోసారి వైసీపీ గెలవడం ఖాయమని టీడీపీ సర్వే నివేదిక తేల్చి చెప్పింది. మరోవైపు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి బొజ్జల అభ్యర్థిత్వం కలిసొస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేసిన సందర్భంలో బొజ్జల సుధీర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.