నారా లోకేష్. కేరాఫ్ చంద్రబాబు. పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇప్పటిదాకా పాదయాత్ర చేసిన వారిని సీఎం సీటు వరించింది. ఆ సెంటిమెంట్ కలసివస్తుందన్న ఆలోచనతోనో లేక పార్టీకైనా తానే బాబు తరువాత లీడర్ అవుతాను అని గట్టిగా చెప్పుకోవడానికైనా లక్ష్యం ఏదైతేనేమి లోకేష్ కాళ్ళను నమ్ముకున్నారు. వీధుల వెంట నడుస్తూ అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు.
లోకేష్ పాదయాత్ర అంటే తెలుగుదేశంలోనే పెద్దగా సంచలనాలు లేవు. ఆయన ఏదో చేస్తున్నారు అని వెళ్ళి కలసి వచ్చిన వారే తప్ప దీని వల్ల ఆకాశం భూమీ బద్ధలైపోతాయని, ఏదో అద్భుతం జరిగిపోతుందన్న భ్రమలు అయితే ఎవరికీ లేవనే అంటున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు 2012లో చేసిన పాదయాత్ర సమయంలోనూ ఎవరికీ ఏ అంచనాలూ లేవు.
ఆ తరువాత బాబు ఎన్నికల్లో గెలిచారు అంటే మోడీ ఇమేజ్, పవన్ గ్లామర్ పొత్తులు ఎత్తులు ఇత్యాదివి కలసి రాబట్టే అన్నారు కానీ పాదయాత్ర వల్ల అని అనలేదు. లోకేష్ పాదయాత్ర మీద వైసీపీ నుంచి భలె గమ్మత్తు అయిన సెటైర్లు వస్తున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే లోకేష్ ని ఎవరు గుర్తిస్తారు అని ఒక డౌటానుమానం వ్యక్తం చేశారు.
ఆయన కంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు పాదయాత్ర చేసినా ఎంతో కొంత పార్టీకి ప్రయోజనం ఉండేదేమో అని కామెంట్స్ చేశారు. లోకేష్ కంటే కూడా అచ్చెన్నకే అయిదారుగురు మంది జనం ఎక్కువగా వచ్చేవారు అని బొత్స వ్యంగ్యంగా అంటున్నారు.
లోకేష్ పాదయాత్రను ఆపుతారు అనుకోవడమే పెద్ద వింత అనేశారు. ఆయన్ని అలా నడవమనండి, ఎవరు ఆపేది ఆయన్ని అని బొత్స అంటున్నారు. లోకేష్ పాదయాత్ర వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఆయన ఆరోగ్యం బాగుంటుందిట. ఈ రోజుల్లో వాకింగ్ అని అంటున్నారు కదా అలా రోజుకు ఇన్ని కిలోమీటర్లు నడిస్తే ఆయన హెల్త్ వరకూ బాగా ఉంటారని బొత్స అంటూనే కాస్తా తేడాగా పాదయాత్ర చేస్తే మాత్రం ఆరోగ్యం చెడిపోగలదు జాగ్రత్త అని హెచ్చరించారు.
లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశానికి అధికారం తధ్యమని తమ్ముళ్ళకు ఎక్కడైనా ఏ మూలనైనా ఆశలు ఉంటే మాత్రం బొత్స వాటిని పూర్తిగా నీరు కార్చేశారు అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర అంటే వైసీపీకి వెటకారం అనుకుంటారు కానీ జనాలకు కూడా ఇపుడు ఇలాంటి వాటి మీద ఆసక్తి పోయిందనే అంటున్నారు. కావాలంటే చూడండి తెలంగాణాలోనూ పాదాలు అరగదీసుకున్న నడుస్తున్న నేతాశ్రీలు ఉన్నారు. వైఎస్సార్ లాంటి ఇమేజ్ ఉన్న వారు జగన్ లాంటి ఫైటర్ పాదయాత్ర చేస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా ఉంటుంది కానీ అందరూ పోలోమంటో నడిచేస్తే దాన్ని వాకింగ్ అంటారు కానీ పాదయాత్ర అని అనరని వైసీపీ నుంచే కామెంట్స్ వస్తున్నాయి.