విశాఖ ఎంపీ కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం డిమాండ్!

రాజకీయాల్లో గుణం చూడాలి. అభ్యర్ధి మంచివాడు సమర్ధుడు అయితే అందరికీ మేలు జరుగుతుంది. కానీ రాజకీయాలు అంటేనే కులం ప్రధానం అయిపోయాయి. ఎక్కడికక్కడ సామాజిక సమీకరణలను చూస్తున్నారు. పోనీ అవి అయినా పూర్తి స్థాయిలో…

రాజకీయాల్లో గుణం చూడాలి. అభ్యర్ధి మంచివాడు సమర్ధుడు అయితే అందరికీ మేలు జరుగుతుంది. కానీ రాజకీయాలు అంటేనే కులం ప్రధానం అయిపోయాయి. ఎక్కడికక్కడ సామాజిక సమీకరణలను చూస్తున్నారు. పోనీ అవి అయినా పూర్తి స్థాయిలో చూస్తున్నారా అంటే కొన్ని చోట్ల వేరే రిజర్వేషన్లు పాటిస్తున్నారు. వాటికి అంగబలం అర్ధబలం అని పేరు పెడుతున్నారు.

విశాఖ ఎంపీ సీటులో కాపులు బీసీలు తరువాత బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం పద్నాలుగు లక్షల జనాభా ఉన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో కాపులు, యాదవులు, బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. రెండు లక్షల వరకు బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

దాంతో ఈ సీటు కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అనూహ్యంగా డిమాండ్ వస్తోంది. ఈ నెల 4న విశాఖలో విప్రోత్సవం పేరుతో బ్రాహ్మణులు అంతా ఏకమై భారీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు లక్ష్యం ఎన్నికల్లో సీట్లు కోరడమే అని అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటుని బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు కేటాయించాలని కోరుతున్నారు. విశాఖ సౌత్ అసెంబ్లీ సీటులో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ సీటుని అడుగుతున్నారు. ఏపీ వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం కనీసంగా ఆరు సీట్లు గరిష్టంగా పది సీట్లు అయినా బ్రాహ్మణులకు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం పెద్దలు కోరుతున్నారు.

విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే తెన్నేటి విశ్వనాధం గతంలో ఎంపీ అయ్యారు. ఆయన తరువాత ద్రోణంరాజు సత్యనారాయణ విశాఖ లోక్ సభ ఎంపీగా గెలిచారు. ఎమెర్జెన్సీ టైం లో దేశమంత కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీచినా విశాఖలో కాంగ్రెస్ గుర్తు మీద ఆయన నెగ్గారు. 1984లో తెలుగుదేశం పార్టీ లోకల్ అభ్యర్ధినే ఎంపిక చేసింది. 

అలా ఆనాటి రాజకీయ కురు వృద్ధుడు భాట్టం శ్రీరామమూర్తి ఎంపీ అయ్యారు. ఆ తరువాత నలభై ఏళ్ళుగా బ్రాహ్మణులకే కాదు లోకల్ క్యాండిడేట్ కే ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వడంలేదు. దాంతో ఈసారి బ్రాహ్మణులకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని టీడీపీ వైసీపీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు బ్రాహ్మణులు డిమాండ్ పెడుతున్నారు.