బాబు త‌ర‌ఫున హైకోర్టులోనూ అవే వాద‌న‌లు?

స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు హౌస్ అరెస్టు ఊర‌ట ద‌క్క‌లేదు! చంద్ర‌బాబు హౌస్ అరెస్టులో ఉంటార‌ని, ఆయ‌న‌ను జైలు నుంచి విడుద‌ల చేస్తే…

స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు హౌస్ అరెస్టు ఊర‌ట ద‌క్క‌లేదు! చంద్ర‌బాబు హౌస్ అరెస్టులో ఉంటార‌ని, ఆయ‌న‌ను జైలు నుంచి విడుద‌ల చేస్తే చాలంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు గ‌ట్టిగా వాదించినా ప్ర‌యోజనం ద‌క్క‌లేదు. చంద్ర‌బాబుపై న‌మోదైన కేసుల్లో హౌస్ అరెస్టు కు ఆస్కార‌మే లేద‌ని సీఐడీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టానికి సంబంధించిన సెక్ష‌న్ల‌లో రెండు ర‌కాల క‌స్ట‌డీకే ఆస్కారం ఉంద‌ని సీఐడీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు వాదించారు.

అయితే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీ లేక‌పోతే పోలిస్ క‌స్ట‌డీ.. ఈ రెండింటికే ఆస్కారం ఉంద‌ని, ఆ చ‌ట్ట‌ప్ర‌కారం హౌస్ అరెస్టుకు ఆస్కారం లేద‌ని సీఐడీ త‌ర‌ఫున వాద‌న సాగింది. అయితే ఏదో ఒక కేసులో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ సుప్రీం కోర్టు ఒక సారి హౌస్ అరెస్టుకు అవ‌కాశం ఇచ్చింద‌ట‌. ఆ పాయింట్ ను ప‌ట్టుకుని లూథ్రా బ‌ల్ల గుద్దార‌ట‌!

అయితే ఆ కేసులో నిందితుడు ఏకంగా నాలుగు సంవ‌త్స‌రం పాటు జైల్లో గ‌డిపాడ‌ని, అనారోగ్యం బారిన ప‌డిన ఆ నిందితుడికి నాలుగేళ్లుగా జైల్లో ఉన్నందున‌.. హౌస్ అరెస్ట్ కు అవ‌కాశం ఇచ్చింద‌ట‌! మ‌రి చంద్ర‌బాబు కూడా వ‌యోవృద్ధుడే అయినా.. ఈయ‌న అరెస్ట్ అయ్యి నాలుగు రోజులు అయినా గ‌డ‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం హౌస్ అరెస్టుకు ఒప్పుకోన‌ట్టుగా ఉంది!

ఆ సంగ‌త‌లా ఉంటే.. హైకోర్టులో చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్ తో పాటు ఒక‌వేళ బెయిల్ ఇవ్వ‌క‌పోతే హౌస్ అరెస్టుకు అవ‌కాశం ఇవ్వాల‌నే పిటిష‌న్ కూడా వేశార‌ట చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాదులు. మ‌రి పై కోర్టులో వీరి వాద‌న‌లు ఎలా సాగ‌బోతున్నాయి.. అంటే, రిమాండ్ తీర్పుకు ముందు ఏ వాద‌న‌లు సాగాయో హైకోర్టులో కూడా అవే రిపీట్ కాబోతున్నాయ‌ట‌!

అంటే.. చంద్ర‌బాబును 24 గంట‌ల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌లేదు, చంద్ర‌బాబు అరెస్టు గురించి గ‌వ‌ర్న‌ర్ కు స‌మాచారం ఇవ్వ‌లేదు.. ఈ రెండు పాయింట్ల‌తో ఏసీబీ కోర్టులో లూథ్రా వాద‌న‌లు సాగాయి. హైకోర్టులో కూడా ఇవే అంశాల‌ను ప్ర‌స్తావించి బెయిల్ కోర‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో చంద్ర‌బాబు త‌ప్పించుకోవ‌డానికి, క‌నీసం జైలు నుంచి బ‌య‌ట‌కు రావడానికి సాంకేతిక అంశాలు త‌ప్ప ఆయ‌న  లాయ‌ర్లు ఆయ‌న నిర్దోషి అనేవాద‌నేదీ వినిపించ‌లేరేమో!