తెలుగు రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి దత్త తండ్రి, దత్త పుత్రుడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్దుగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ను దత్త పుత్రుడు అని పిలుస్తుంటారు. పవన్‌కు చంద్రబాబు దత్త తండ్రి అని దెప్పి పొడుస్తుంటారు. ఈ కామెంట్స్ చంద్రబాబుకు ఆనందాన్ని, పవన్‌కు దుఃఖాన్ని మిగిల్చాయి. తనను దత్త పుత్రుడని అన్నప్పుడల్లా పవన్ గిలగిలలాడుతుంటారు.
ఈ నేపథ్యంలో గాయని స్మిత టాక్ షోలో చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 1968లో తాను ఎస్ఎస్ఎల్‌సీ ఫెయిల్ అయినట్టు చెప్పుకొచ్చారు. దీంతో మళ్లీ అదే స్కూల్‌లో చదవలేక తిరుపతిలో చేరినట్టు చెప్పారు. ఒక్కోసారి ఓటమి, వైఫల్యాలు మనలో కసిని పెంచుతాయన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ పరీక్షల్లో తప్పలేదని చంద్రబాబు చెప్పడంపై నెటిజన్లు తమదైన సృజనాత్మక ధోరణిలో సెటైర్స్ విసురుతున్నారు.
చంద్రబాబు పదో తరగతిలో, అలాగే దత్త పుత్రుడు ఇంటర్ ఫెయిల్ అయిన బాపతు అంటూ పవన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడం గమనార్హం. అందుకేనేమో నోరు తెరిస్తే అంత విజ్ఞానం పొంగి పొర్లుతుంటోందని నెటిజన్లు వెటకరిస్తున్నారు. 1969లో మన రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్‌సీ లాస్ట్ బ్యాచ్ అని పెద్దలు చెబుతున్నారు. అదే ఏడాది టెన్త్ ఫస్ట్ మొదలైనట్టు తెలిసింది. ఎస్ఎస్ఎల్‌సీ అంటే మన రాష్ట్రంలో 11వ తరగతి. ఇదే తమిళనాడు, కర్నాటకలో ఇప్పటికీ ఎస్ఎస్ఎల్‌సీ అంటే టెన్త్ కిందే పరిగణిస్తారని సమాచారం. అందుకే చంద్రబాబు తాను ఎస్ఎస్ఎల్‌సీ ఫెయిల్ అంటే టెన్త్‌గానే లెక్కిస్తూ దెప్పి పొడుస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నారా లోకేశ్ పదేపదే టెన్త్ ఫెయిల్ అయ్యాడని విమర్శిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు. ఫెయిల్ అయ్యాడని విమర్శించడం వెనుక లోకేశ్ ఉద్దేశం… తెలివిలేని దద్దమ్మ అని చెప్పడం. లోకేశ్ లెక్క ప్రకారం తన తండ్రి కూడా ఆ బాపతే అని అనుకోవాలేమో.