చంద్రబాబు, పవన్ ఫెయిల్యూర్ ఇది! జనం గుస్సా!!

రాజకీయాలు రూపురేఖలు మారుతున్నాయని, ప్రజలు తెలివి మీరుతున్నారని, రాజకీయ పరిణామాలను వారు చూసే దృష్టి కోణం మారుతున్నదని, ఆలోచించి ఓటు వేసే విచక్షణ వారికి వస్తున్నదని చంద్రబాబునాయుడుకు తెలియదా? ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు…

రాజకీయాలు రూపురేఖలు మారుతున్నాయని, ప్రజలు తెలివి మీరుతున్నారని, రాజకీయ పరిణామాలను వారు చూసే దృష్టి కోణం మారుతున్నదని, ఆలోచించి ఓటు వేసే విచక్షణ వారికి వస్తున్నదని చంద్రబాబునాయుడుకు తెలియదా? ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగేపాటి శక్తి పాపం పవన్ కల్యాణ్ కు ఉండకపోవచ్చు.

కానీ కేవలం పడికట్టు మాటలుచెప్పి.. నలభయ్యేళ్ల కిందట తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు ఎలాంటి పడికట్టు మాటల పద ప్రయోగాలకు జనం మోసపోతూ ఉండేవాళ్లో అలాంటిప్రయోగాలే ఇంకా చేస్తూ బతికేద్దాం అని చంద్రబాబునాయుడు అనుకుంటే ఎలాగ? చిలకలూరి పేట సభ, ప్రధాని మోడీ కూడా హాజరైన , విపక్ష కూటమి శంఖారావం పూరించిన సభలో చంద్రబాబు- ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ల ఉమ్మడి ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా బయపడింది. ఈ ఫెయిల్యూర్ పై ఏపీ ప్రజలు గుస్సా అవుతున్నారు. ఇంతకూ ఏమిటా ఫెయిల్యూర్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేస్తా అంటూ చంద్రబాబునాయుడు పురాతన కాలం నాటి పడికట్టు పదాలు వాడుతున్నారు. ఇప్పుడున్న నిర్మాణంలో ఏం శిథిలమై ఉన్నదని ఆయన పునర్నిర్మాణం అనే మాట వాడుతున్నారో తెలియదు. అయిదేళ్ల పాటు అధికారం ఇస్తే.. గ్రాఫిక్స్ బొమ్మల మాయ తప్ప రాజధాని పేరిట ఒక ఇటుక కూడాపెట్టని చేతగానితనం చంద్రబాబుది. అయితే ఆయన ఇప్పుడు నిర్మాణం కాదు, పునర్నిర్మాణం చేసేస్తా అంటూ కేవలం అందుకోసమే కేంద్రంలోని మోడీ సర్కారుతో మళ్లీ జతకట్టినట్టుగా చెప్పుకొచ్చారు. మంచిదే. మరి ఏ తరహా పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నారు?

చంద్రబాబు- పవన్ ల ద్వయం ఏర్పాటుచేసిన చిలకలూరి పేట సభకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. మాట్లాడారు. ఇంతకూ ఏపీ పునర్నిర్మాణం దిశగా ఆయన ఏం హామీ ఇచ్చారు. ఏపీ కోసం కొత్తగా ఫలానా పనిచేస్తానని మోడీ ఒక్క మాట కూడా చెప్పనేలేదు. ఇలా చేయాలనుకుంటున్నాను గనుక.. మా కూటమికి ఓట్లు వేయండి అని అననేలేదు.

ఎగబడి మరీ మోడీ తో పొత్తు పెట్టుకున్న ఈ ఇద్దరు నాయకులు రాష్ట్రం కోసం ఆయన నుంచి ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాబట్టలేకపోయారా? అనేది ఇప్పుడు జనానికి కలుగుతున్న సందేహం. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న మోడీ తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే గనుక.. మీకు అది చేస్తాం ఇదిచేస్తాం అంటూ అందరికీ బోలెడు వరాలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఆయన చిలకలూరి పేట వేదికగా ఏం కొత్త వరం ప్రకటించారో చెప్పగల దమ్ము సత్తా చంద్రబాబుకు, పవన్ కు ఉన్నాయా?

ఆయనతో పొత్తు పెట్టుకున్న నాయకులు ఒక్క హామీనైనా ఆయన నుంచి రాబట్టలేకపోయారా? తెలుగుప్రజలు అసహ్యించుకుంటారనే భయం వారికి లేదా? అనే సందేహం కలుగుతోంది. మోడీ వీరితో పొత్తులకోసం ఎగబడి రాలేదు. మీరు తప్ప మాకు దిక్కులేదు మహాప్రభో అని వీరే వెళ్లి ఆయనతో బంధం కుదుర్చుకున్నారు. అందుకే ఆయన వీరికి ఏ కొత్త వరమూ ప్రామిస్ చేయలేదు.

హామీల రూపంలోనే మోడీ నుంచి ఏమీ పొందలేని వీరు, రేపు గెలిస్తే మాత్రం ఏమైనా సాధించగలరా? ఇది అచ్చంగా ఈ ఇద్దరు నాయకుల ఫెయిల్యూర్ మాత్రమే. మరి ఓటు గురించి తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన ఏపీ ప్రజలు ఈ సంగతిని గమనిస్తున్నారా?