బాబులో చిప్ ఎగిరిపోయింది గురూ!

జీవితంలో ఏది పోయినా ఫ‌ర్వాలేదు, కానీ ఆత్మ‌విశ్వాసం పోగొట్టుకోకూడ‌దు. అది పోయిన త‌ర్వాత జీవిత‌మంటూ ఏదీ వుండ‌దు. ఎందుకంటే ఏదైనా చేయాల‌న్నా, సాధించాల‌న్నా మ‌నిషికి త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ముఖ్యం. చంద్ర‌బాబునాయుడిలో ఆత్మ‌విశ్వాసం అనే…

జీవితంలో ఏది పోయినా ఫ‌ర్వాలేదు, కానీ ఆత్మ‌విశ్వాసం పోగొట్టుకోకూడ‌దు. అది పోయిన త‌ర్వాత జీవిత‌మంటూ ఏదీ వుండ‌దు. ఎందుకంటే ఏదైనా చేయాల‌న్నా, సాధించాల‌న్నా మ‌నిషికి త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ముఖ్యం. చంద్ర‌బాబునాయుడిలో ఆత్మ‌విశ్వాసం అనే చిప్ పూర్తిగా పోయిన‌ట్టుంది. మ‌నిషిలో భ‌యం, మాట‌లో త‌డ‌బాటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ప‌దేప‌దే ఈ ద‌ఫా టీడీపీ గెల‌వ‌లేకపోతే అంటూ… ఉద్వేగంతో, గ‌ద్గ‌ద స్వ‌రంతో మాట్లాడాన్ని గ‌మ‌నించొచ్చు.

గ‌తంలో ఎప్పుడూ చంద్ర‌బాబును ఇంత‌టి ద‌య‌నీయ స్థితిలో చూడ‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదేంటో గానీ సానుభూతి కోసం బాబు స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నార‌నే విమ‌ర్శిస్తున్న వాళ్లే ఎక్కువ‌. అయ్యో చంద్ర‌బాబుకు ఎందుకీ దుస్థితి అని బాధ‌ప‌డేవాళ్లు క‌రువ‌య్యారు. పిల్ల‌నిచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు… క‌ర్మ అనుభ‌వించాల్సిందే అని శాప‌నార్థాలు పెడుతున్నారు.

ఇవాళ టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. మ‌రోసారి రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే అంటూ నిస్స‌హాయ‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోయి చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌లేంటో తెలుసుకుందాం.

“ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే… ఇక ఈ రాష్ట్రాన్ని కాపాడే శ‌క్తి ఎవ‌రికీ వుండ‌దు. నాకేం అధికారం కావాలా? నాకు అవ‌స‌రం లేదే. ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడుకోవాలి. వీళ్ల భ‌విష్య‌త్ అంధ‌కారం కావ‌డానికి వీల్లేదు. భావిత‌రాల భ‌విష్య‌త్ నాశ‌నం కావ‌డానికి వీల్లేదు. ఆ విష‌య‌మే నేను చెబుతున్నా. ఆ మాటే మొన్న కూడా చెప్పా. ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెల‌వ‌క‌పోతే, మీరు కూడా సిద్ధంగా లేక‌పోతే, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన‌వాళ్ల‌మ‌వుతాం. అది ఎట్టి ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని మీ అంద‌రికీ చెబుతున్నా. ఈ రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం మీరు ముందుకు రండి. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం, మీ భ‌విష్య‌త్ కోసం రండి” అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం కంటే, మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం అవుతార‌నే భ‌యం, అనుమానం చంద్ర‌బాబులో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆయ‌న మాట‌లే చెబుతున్నాయి. అందుకే ఆయ‌న ప‌దేప‌దే ఈ ద‌ఫా తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అని అంటుండాన్ని గ‌మ‌నించొచ్చు. ముఖ్య‌మంత్రి కావాల‌ని త‌న‌కేం మాత్రం కోరిక లేద‌నే కాలం చెల్లిన క‌బుర్లు ఆయ‌న చెప్ప‌క పోవ‌డమే మంచిది. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్‌, మీ భ‌విష్య‌త్ కోసం ముందుకు రండి అని చంద్ర‌బాబు పిలుపునివ్వ‌డం బ్ర‌హ్మానందం కామెడీని త‌ల‌పిస్తోంది.

త‌న కొడుకు లోకేశ్ భ‌విష్య‌త్ కోసం టీడీపీని గెలిపించాల‌ని కోరితే ఏ స‌మ‌స్యా వుండ‌దు. మ‌న‌సులో ఉద్దేశం ఒక‌టి, బ‌య‌టికి మ‌రొక‌టి మాట్లాడితే గుర్తించ‌లేని అమాయ‌క స్థితిలో జ‌నం లేర‌ని చంద్ర‌బాబు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఏది ఏమైనా చంద్ర‌బాబు మాట‌ల్లో భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోయి, సానుభూతిని న‌మ్ముకున్నార‌నే నిజం కూడా జ‌నానికి తెలిసొస్తోంది.