ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా పెద్ద మనిషి. చట్టం, న్యాయం వుండగా, వ్యక్తిగత జోక్యాలెందుకని తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు హితబోధ చేస్తున్నారు. రెడ్‌బుక్ స్ఫూర్తితో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, పొక్లయినర్, బుల్డోజర్ వెంట పెట్టుకుని ప్రత్యర్థుల భవనాలపైకి వెళ్లి, వాటిని పడగొడితే, చంద్రబాబు తాపీగా వారిని మందలిస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు.
మూడు రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఎస్ఐ రమేశ్‌తో అనుచితంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని గ్రహించిన చంద్రబాబునాయుడు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్ చేసి “ఏమయ్యా ఇలా చేస్తే మన ప్రభుత్వ పరువు ఏం కావాలి” అని మందలించినట్టు వార్తలొచ్చాయి. చంద్రబాబు మందలింపుగా ఒక మాటంటే… పది మాటలన్నట్టు రాయడానికి ఎటూ ఆయన సొంత మీడియా వుంది.
రెండు రోజుల క్రితం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సినీఫక్కీలో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీపీ నాగలక్ష్మి భవనం కూలగొట్టేందుకు మందీమార్బలం, యంత్రాలను తీసుకెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు స్పందించలేదని, బహుశా ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని సీఎం భావించినట్టున్నారని అంతా అనుకున్నారు. అయితే ఒక రోజు ఆలస్యంగా చంద్రబాబు తన పెద్దరికాన్ని చాటు కోవడం గమనార్హం.
తన చాంబర్‌కు కొలికపూడిని పిలిపించుకుని మందలించినట్టు ఆయన అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. రాష్ట్రంలో చట్టాలున్న విషయాన్ని శ్రీనివాసరావుకు చంద్రబాబు గుర్తు చేశారట! ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేసి, చట్టప్రకారం నడుచుకోవాలని హితోపదేశం చేశారట. ఒకవేళ కిందిస్థాయి అధికారులు పట్టించుకోకపోతే తనకు ఫిర్యాదు చేయాలని, అప్పుడు అంతా తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పి తనదైన పెద్ద మనసును ప్రదర్శించారట.
నువ్వే వెళ్లి అక్రమ భవన నిర్మాణాల్ని కూలగొడితే ఎట్లా? అని ఆవేదనతో చంద్రబాబు ప్రశ్నించారట. నిజంగా చంద్రబాబుది ఎంత గొప్ప పెద్దరికమో ….భవనాలు కూల్చకపోతే తెలిసొచ్చేది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థుల భవనాలు కూల్చకపోతే, మంత్రి గారి భార్య దురుసుగా ప్రవర్తించకపోతే… చంద్రబాబునాయుడి పెద్దరికం, గొప్పతనం లోకానికి చాటి చెప్పే అవకాశం టీడీపీ అనుకూల మీడియాకు వచ్చేది కాదు. ఒకవైపు వైసీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల భవనాలు, వైఎస్సార్ విగ్రహాలు , అలాగే అధికార పార్టీ నేతల దురుసు ప్రవర్తన కొనసాగుతుండాలి. మరోవైపు చంద్రబాబు పెదరాయుడు పాత్ర పోషిస్తుండాలి.