వెనకటికి ఒకరిని ఏది రాయమన్నా ఆవు వ్యాసమే రాసేవారని సామెత. అలా ఉంది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు వ్యవహారం. ఆయన వద్దకు ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చినా ఏ విన్నపం చేస్తున్నా బాబు గారు టోన్ సవరిస్తారు. వెంటనే జగన్ని పట్టుకుని విమర్శలతో దాడి చేస్తారు. తిట్ల దండకమే అందుకుంటారు.
సైకో అంటారు, పాలన చేతకాదంటారు. జగన్ సీఎం గా ఉండడమే సకల పాపాలకు కారణం అంటారు. పాపాల భైరవుడు అంటారు. చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయన మూడు సార్లు సీఎం గా పనిచేశారు. తన రాజకీయ అనుభవం గొప్పదని అంటారు.
అటువంటి నాయకుడు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడినపుడు వారి కష్టాలను విని ఓదార్పు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప చీటికీ మాటికీ జగన్ని విమర్శిస్తే వచ్చిన వారికి లాభమేంటి. జగన్ అంటే అంత అసూయ ఏంటి అన్నదే అందరిలోనూ అనిపిస్తోంది. ఆలోచనలు రేకెత్తిస్తోంది.
విపక్ష నేత అంటే ప్రభుత్వాన్ని పట్టుకుని అయిన దానికీ కాని దానికీ విమర్శలు చేయడమేనా. సలహాలు సూచనలు ఇవ్వడం చేతకాదా అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు అసలు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడంలేదు అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు.
ఏపీకి జగన్ ఏమి చేశారని నిలదీస్తున్న చంద్రబాబు రెండున్నర లక్షల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు జగన్ ఇచ్చిన సంగతి గుర్తు లేదా అని అంటున్నారు. సచివాలయాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల పిల్లలు కూడా పనిచేస్తున్నారని, రాజకీయ వివక్ష ఏమాత్రం లేకుండా జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అంటున్నారు.
ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతూ ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రాకు రాజధాని అవసరం లేదని బాబు అనడాన్ని తప్పు పట్టారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతే రాజధాని విశాఖకు వస్తుందని బూడి అంటున్నారు.
చంద్రబాబు పద్నాలుగేళ్ళ సీఎం అని కానె ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఆర్డీవో ఆఫీసుని ఏర్పాటు చేసుకోలేకపోయారని, జగన్ సీఎం అయ్యాక దాన్ని ఏర్పాటు చేశారన్నది మరచిపోతే ఎలా అని బూడి నిలదీశారు. కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన విమర్శలు హుందాగా లేవని అంటున్నారు.