ఏపీలో రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఏ హాట్ టాపిక్ ల చుట్టూ అయినా తిరుగుతూ ఉండవచ్చు గాక.. ఆ వ్యవహారాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబునాయుడు మాత్రం మహదానందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతానికి ఎవ్వరూ బయటకు చెప్పుకోకపోయినప్పటికీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కలిసి పోటీచేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రజలకు సకాలంలో సంకేతాలు అందజేశాననేది ఆయనలోని ఆనందానికి ఒక చిన్న కారణం. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టిందని.. తాను ఒక పెద్ద కలవరం పుట్టించగలిగానని కూడా చంద్రబాబు మురిసిపోతున్నారు.
తెలుగు ప్రజలకు తెలియని సంగతి కాదుగానీ.. చంద్రబాబు వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిసి ఓదార్పు యాత్ర నిర్వహించిన తరువాత.. బిజెపిలో మాత్రం కలవరం పుట్టింది. మామూలు పరిస్థితుల్లో అయితే.. వాళ్లు నోరేసుకుని పడిపోచయే వారే. తీవ్రమైన విమర్శలు, అర్థం పర్థం లేకుండా గుప్పించే వారే. కానీ.. లోలోపల ఉడికిపోతూ ఆచితూచి వ్యవహరించే ధోరణిలో వెళ్లారు.
పవన్ కల్యాణ్ తో తమంత తాము తెగతెంపులు చేసుకోవడానికి వారికి ఇష్టం లేదు. అలా తెగతెంపులు జరిగితే వారికి ఇబ్బందేం లేదు.. కానీ పవన్ వైపునుంచి జరగాలని చూస్తున్నారు. అందువలన.. ఈ భేటీపై బహిరంగంగా ఏమీ మాట్లాడకుండా. ప్రెవేటు సంభాషణల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతో పోతే పవన్ కల్యాణ్ మళ్లీ మునుగుతాడని, తమ పార్టీతో ఉండడమే.. పవన్ కు మంచి రాజకీయ భవిష్యత్తును ఇస్తుందనే వాదనను ప్రచారంలో పెట్టడానికి బిజెపి నాయకులు నానా పాట్లు పడుతున్నారు. ఆ వాదనను ప్రజల్లోకి తమచేతికి మట్టి అంటకుండా తీసుకువెళ్లాలనే కోరిక ఉంది గానీ చేతకావడం లేదు. ఈలోగా కన్నా రూపంలో బిజెపిలో ముసలం పుట్టింది.
ఈ పరిణామాలు చూసి చంద్రబాబునాయుడు పండగ చేసుకుంటున్నారు. బిజెపిలోముసలం పుట్టడం, వారు ఒక మెట్టు దిగడానికి ఉపయోగపడుతుందని.. కేంద్రంలోని బిజెపి వద్ద రేపు ఎన్నికల సమయానికి తమ మూడు పార్టీలు కలిసి పోటీచేసేలా ఒప్పించడానికి అవకాశాలను పెంచుతుందని ఆయన ఆశిస్తున్నారు.
అలాగే.. ఆ పరిస్థితి వచ్చినప్పుడు.. బిజెపి బేరమాడే సీట్ల విషయంలో కూడా తమకు ఎడ్వాంటేజీ ఉండాలంటే.. ఇలా ముసలం పుట్టడం ఉపయోగపడుతుందని.. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తూ గెలిచే వాతావరణం క్రియేట్ చేయకపోతే మరింత మంది కమల నాయకులు పార్టీని వీడిపోతారని సంకేతాలు పంపడానికి కుదురుతుందని చంద్రబాబు దురాశ. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.