రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలి. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత లాంటి వాటికి స్థానం లేదని పదేపదే నిరూపిస్తున్న రాజకీయ ఉద్ధండుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అధికారం తప్ప, మరేదీ వుండదని, దాన్ని సాధించేందుకు ఏం చెప్పినా తప్పు కాదనే ఆశయంతో పని చేయడంతో పాటు అదే నిజం అని నిరూపిస్తున్న బాబును చూస్తే ముచ్చటేస్తుంది. ఇది కదా ప్రాక్టికాలిటీ అని ఎవరికైనా అనిపిస్తుంది.
మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. ఇప్పుడాయన విపరీతమైన ప్రజాదరణ పొందిన నాయకుడు. అందుకే ఆయన ఏం చెప్పినా విలువ వుంటుంది. ఏపీలో ఘోర ఓటమితో కుమిలిపోతున్న వైసీపీపై టీడీపీ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే బాబు మాత్రం… ఓటమి బాధతో వైసీపీ శ్రేణులే తమ పార్టీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారనడం గమనార్హం.
ఇదే కదా బాబు రాజకీయం అంటే. దాడులు చేయొద్దని తమ పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడానికి బదులు, వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనడం బాబు మార్క్ రాజకీయానికి నిదర్శనం. బాబు ఏది చెబితే, అదే కరెక్ట్ అని కళ్లకద్దుకుని ప్రచురించే, ప్రసారం చేసే మీడియా ఉంది.
వైసీపీ కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని తన పార్టీ కేడర్‌కు బాబు ఒక ప్రకటనలో పిలుపు ఇవ్వడం గమనార్హం. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కేడర్ పూర్తి సంయమనం పాటించాలని బాబు కోరడం విశేషం. వైసీపీ కార్యకర్తలే రెచ్చగొడుతున్నారు తప్ప, తమ వాళ్లు ఏమీ చేయడం లేదని ఆయన వెనకేసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రకటన ద్వారా దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నారనే చర్చకు తెరలేచింది. అధికారం మారినప్పుడు, ఇలా దాడులు చేసుకుంటూ పోతే, చివరికి ఎలా మిగలాలని కోరుకుంటున్నారో వారికే తెలియాలి. పౌర సమాజం మాత్రం ప్రస్తుతం ఏపీలో నెలకున్న రాజకీయ పరిస్థితులపై సంతోషంగా లేదన్నది వాస్తవం.