నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సైకోగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అభివర్ణిస్తుంటారు. సైకో పోవాలి, సైకిల్ రావాలనేది టీడీపీ ఎన్నికల నినాదం. అయితే చంద్రబాబు ఇటీవల మాట్లాడుతున్న మాటలు వింటే, ఆయనకు మైండ్ పూర్తిగా పోయిందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. జగన్ సైకోనా, కాదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే జగన్‌పై ప్రత్యర్థులు చేసేవన్నీ రాజకీయ విమర్శలు కాబట్టి.
ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రసంగాల్లోని ఆణిముత్యాలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పాలకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం కోసం వేడుకుంటున్న చంద్రబాబు మానసిక స్థితిని ప్రతిబింబించే ఆయన మాటల గురించి తెలుసుకుందాం.
“రాఖీ పంపిస్తున్నా. 45 రోజులు పూజల గదిలో పెట్టి పూజలు చేయండి. ఆ రాఖీని, ఆ మహాశక్తిని మీరు చేతికి కట్టుకుని, ఏ కష్టమొచ్చినా నన్నొకసారి తలచుకుంటే, ఆ భగవంతుడి సంకల్పానికి నేను అండగా వుంటా”
“ఒక్క నిమిషంలో లైట్లు వేసి చూపించండి. ఆకాశంలో నక్షత్రాలు మన సెల్‌ఫోన్ టార్చ్ లైట్లతో వెలిగిపోతున్నాయి. అదీ టెక్నాలజీ అంటే. దీన్ని కూడా ప్రవేశ పెట్టింది నేనే”
“ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్‌లో బైసీపీ చదవాలి”
ఈ మాటలు వింటుంటే… బాబోయ్, చాలు చాలు, ఇక వినలేమని చెవులు మూసుకుంటారు. మతిస్థిమితం సరిగా ఉన్న వాళ్లెవరూ ఇలాంటి అతిశయోక్తి, అజ్ఞాన, అహంకార మాటలు మాట్లాడరని పౌర సమాజం చెబుతోంది. చంద్రబాబు తనను మనిషిగ కాకుండా మానవాతీత శక్తులున్న దైవాంశ సంభూతిగా ఊహించుకుంటున్నారు. అందుకే రాఖీ కట్టుకుని తనను తలచుకుంటే భగవంతుడి సంకల్పానికి తాను తోడుగా వుంటానని మహిళలకు చెప్పారు.
అధికారం ఇవ్వాలని అడుగుతున్న ఓ నాయకుడి నుంచి ఇలాంటి మాటలు వినడానికే భయం కలుగుతోంది. రాఖీ ఇవ్వడం ఏంటి, 45 రోజుల పూజలు, తనను స్మరించుకోవాలని పిలుపు ఇవ్వడం మానసిక స్థితి బాగున్న వాళ్లు మాట్లాడేవేనా? అని జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి.
టార్చిలైట్ల వెలుగును చూస్తూ…టెక్నాలజీని తానే కనిపెట్టానని చంద్రబాబు చెబుతుంటే నవ్వుకోవడం జనం వంతైంది. భవిష్యత్‌లో ఇంకా బాబు నుంచి ఎలాంటి ఆణిముత్యాలు దొర్లుతాయో అని జనం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇక ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్‌లో బైపీసీ చదవాలనే కామెంట్‌తో బీకామ్‌లో ఫిజిక్స్ చదివిన జలీల్‌ఖాన్‌కు పెద్దన్నగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడికి చాలా ఏళ్ల క్రితమే మైండ్ పోయి, ఇంటి పట్టునే ఉన్నారు. కాస్త ఆలస్యంగా చంద్రబాబులో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కనీసం ఎన్నికల ముంగిటైనా మానసిక స్థితి బాగుందని అనుకునేలా చంద్రబాబు మాట్లాడాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.