చంద్రబాబు వైఖరిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నేతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న తమ ఆకాంక్షను చంద్రబాబు ఎదుట బయట పెడుతున్నారు. వారిని హర్ట్ చేయకుండా, పార్టీ కోసం వాడుకునేందుకు చంద్రబాబు పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నారు. సహజంగానే చంద్రబాబు “నో” అని ఎవరికీ చెప్పరు. అలాగని “ఎస్” అనీ అననట్టు తలూపుతుంటారు.
చంద్రబాబును కలిసిన నాయకులు తమ నియోజకవర్గాలకు వెళ్లి టికెట్ తమకే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో టీడీపీలోని ఇతర నాయకులు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. తమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మళ్లీ మరొకరికి ఎలా చెబుతారనే చర్చకు తెరలేచింది. తమకు పెద్దాయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న నాయకుడిపై నెగెటివ్‌గా మాట్లాడినట్టు కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు.
దీంతో నియోజకవర్గాల్లో టీడీపీలో కొత్త సమస్య ఏర్పడుతోంది. తమకు టికెట్ ఇవ్వకపోతే, సొంత పార్టీ నేతను ఓడించడానికి కూడా వెనుకాడకూడదనే పట్టింపులకు వెళుతున్నారు. ఇదంతా చంద్రబాబు ద్వంద్వ వైఖరి వల్ల ఉత్పన్నమైన సమస్యగా చెబుతున్నారు. టీడీపీలో ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఎక్కువ నియోజకవర్గాల్లో ఉన్నాయి.
చంద్రబాబునాయుడు అందరినీ పార్టీ బలోపేతానికి వాడుకోవాలనే ఆలోచనే, క్షేత్రస్థాయిలో టీడీపీకి సమస్యల్ని సృష్టిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా కాకుండా ఫలానా లీడర్‌కే టికెట్ అని ప్రకటిస్తే, మిగిలిన నేతలు వారితో కలిసి ప్రయాణించడమా, లేక ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటారని అంటున్నారు.
కానీ అలా జరగడానికి చంద్రబాబు సుతారమా ఇష్టపడరని, చివరి వరకూ నాన్చివేత ధోరణితో వ్యవహరించి నష్టం కలిగిస్తారనే ఆందోళన కనిపిస్తోంది. నష్ట నివారణకు ఒకే మార్గం. ఏ మాత్రం బెదురు లేకుండా బలమైన నాయకులని భావించిన వారికే టికెట్లు ఖరారు చేయడం. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం వుండదు.