బాబులోని అవకాశవాది విశ్వరూపం!

చంద్రబాబునాయుడులోని అవకాశవాది తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అందితేజుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే ఆయనలోని రాజకీయ లక్షణం మరోసారి ప్రస్ఫుటం అయింది. లాస్ట్ చాన్స్ అనే బేల పలుకులను ప్రజల మీదికి సంధించి.. ఎలాగైనా జగన్మోహన్…

చంద్రబాబునాయుడులోని అవకాశవాది తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అందితేజుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే ఆయనలోని రాజకీయ లక్షణం మరోసారి ప్రస్ఫుటం అయింది. లాస్ట్ చాన్స్ అనే బేల పలుకులను ప్రజల మీదికి సంధించి.. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని తపనపడుతున్న చంద్రబాబునాయుడు, అందుకు మోడీ భుజాన్ని కూడా ఆసరాగా వాడుకోవాలని అనుకుంటున్న కుట్రను మొత్తానికి తానే బయటపెట్టారు. 

మోడీని, భారతీయ జనతా పార్టీని పిచ్చపిచ్చగా తిట్టిపోసి.. మోడీని తిట్టడం ద్వారానే తన పార్టీకి అధికారం దక్కుతుందని, తాను మళ్లీ సీఎం అవుతానని చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల సమయంలో విశ్వసించారు. అందుకే ఎన్నికలకు కొన్నాళ్ల ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంనుంచి బయటకు వచ్చేసి.. ఎడాపెడా వారి మీద నిప్పులు కురిపించడం ప్రారంభించారు. అన్నాళ్లు తానుగా చంపేసిన ప్రత్యేక హోదా డిమాండ్ ను పట్టుకుని, ధర్మపోరాటదీక్షల పేరుతో డ్రామాలను నడిపించారు. 

2014లో .. చంద్రబాబు ఏదో ఉద్ధరించేస్తాడని ప్రజలు అధికారం అప్పగిస్తే.. అయిదేళ్ల పాటు నాటకాలు ఆడి, రాష్ట్రాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేకపోయిన తన చేతగానితనం, అమరావతి రాజధాని పేరుతో త్రీడీ డ్రాయింగులు, రంగుల బొమ్మలు చూపించి చేసిన వంచన అన్నీ ప్రజలు గుర్తిస్తారనే భయం చంద్రబాబును వెన్నాడింది. రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన తన చేతగానితనం మొత్తం మోడీ మీదకు నెట్టేయడానికి కుట్రపన్ని.. ఆయనతో విభేదించి రాజకీయం నడిపించారు. ప్రజలు నమ్మలేదు. ఓడగొట్టారు. 

ఇప్పుడు మళ్లీ మోడీ భుజాలమీద ఎక్కి సవారీచేస్తూ అధికారంలోకి రావాలని చంద్రబాబునాయుడు కలలు కంటున్నారు. తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఆల్రెడీ తన పట్టులోనే ఉన్నాడు. మోడీని లొంగదీయడానికి ఆల్రెడీ దత్తపుత్రుడిని ప్రయోగించాడు. తన వంతు భజన కూడా ఎడాపెడా చేస్తున్నాడు. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఆయనను ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేస్తే విపరీతంగా మోడీ భజన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

ఎన్డీయేలో మళ్లీ కలుస్తారా.. మోడీతో కలిసి జట్టుకట్టి పోటీచేస్తారా? అని అడిగితే ‘‘ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు నేను జవాబివ్వను’’ అంటూ చంద్రబాబు అతితెలివి సమాధానం ఇచ్చారు. బహుశా, నా సంగతి తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావా అని ఆ జర్నలిస్టు మీద చంద్రబాబు జాలి పడి ఉంటారు. 

మోడీ విజన్ 2047 అనేది చాలా ఇంపార్టెంట్ అనీ.. దాన్ని సాకారం చేయడానికి తాను ఆయనకు అండగా ఉంటానని అంటున్నారు. మోడీ కరుణాకటాక్ష వీక్షణాల ప్రాప్తికోసం ఎన్నికలలోగా ఆయన ఇంకా ఎన్నెన్ని చిన్నెలు ప్రదర్శిస్తారో చూడాలి.