సర్వరోగాలున్న చంద్రబాబునాయుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నుంచి వస్తోంది. బెయిల్ కోసం తాను ఎన్నో రోగాలతో బాధపడుతున్నట్టు కోర్టుకు చంద్రబాబు సమర్పించిన అఫిడవిట్టే ఆయనపై విమర్శలకు అవకాశం కల్పించింది.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ ఊహించలేకపోయింది. అంతేకాదు, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్టగా ఇంత కాలం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందిన చంద్రబాబు….50 రోజులకు పైగా జైల్లో మగ్గాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలెవరూ ఊహించనవి ఎన్నో జరిగిపోయాయి. ఇంత కాలం తాను నిప్పులా బతికానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబుకు, ఇకపై ఆ అవకాశం ఉండదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్‌పై వైసీపీ గట్టిగానే ఎదురు దాడికి దిగుతోంది. ఈ నెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం.
తనకు అనేక రోగాలున్నట్టు బెయిల్ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. రోగాలున్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడనే అర్థం వచ్చే రీతిలో కొట్టు సత్యనారాయణ డిమాండ్ చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో చంద్రబాబు రోగాలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్టు మంత్రి కామెంట్స్‌తో సంకేతాలు వెలువడుతున్నాయి.
చంద్రబాబు జైలుకు వెళ్లకముందు ముసలాయన అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెటకరించేవారు. అయితే తనకు వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని, ఆలోచనల్లో, నడవడికలో నిత్య యువకుడిని అని చంద్రబాబు తిప్పికొట్టేవారు. మరి ఇప్పుడు తన రోగాలపై చంద్రబాబు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.