తన సహజ శైలికి భిన్నంగా ఎన్నికలకు ఎంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనతో చంద్రబాబునాయుడు ఉన్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో ఎన్నికలకు ఫిబ్రవరి లేదా మార్చి 15వ తేదీలోపు షెడ్యూల్ రావచ్చనే ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ వచ్చే వరకూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో కనీసం 100-110 నియోజకవర్గాలకు అభ్యర్థులను డిసెంబర్ నెలాఖరు లోపు ప్రకటించాని చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొందరికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ మనసులో ఏముందో తెలుసుకుని, అందుకు తగ్గట్టు అడుగులు వేయాలని చంద్రబాబు ఆలోచన.
పవన్‌కు ఎన్ని ఇవ్వాలో చంద్రబాబు మనసులో ఒక సంఖ్య ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సంఖ్యతో పాటు ఎక్కడెక్కడ ఇవ్వాలనే విషయమై చంద్రబాబు, పవన్ మధ్య ఒక అవగాహన కూడా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల జనసేనతో పెద్దగా సమస్య ఉండకపోవచ్చనేది టీడీపీ అభిప్రాయం. అయితే సీట్లు, నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటిస్తే … క్షేత్రస్థాయిలో స్పందన ఎలా వుంటుందనేది మాత్రం ఆసక్తికరమే.
ఎందుకంటే ఇటీవల టీడీపీ, జనసేన మధ్య సమావేశాలు ముఖ్యంగా ఆ రెండు పార్టీలు బలంగా ఉన్న చోట ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. ఇరుపార్టీల నాయకులు తమ నాయకత్వాన్ని పోగొట్టుకోడానికి సిద్ధంగా లేరు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండాల్సిందే అని జనసేన, టీడీపీ నేతలు పట్టుబడుతున్నాయి.
ఇలాంటి వాటిని అధిగమించడం ఇరుపార్టీల పెద్దలకు కత్తిమీద సామే. ఏది ఏమైనా వివాదాల్లేని 100 నియోజకవర్గాలకు తక్కువ కాకుండా అభ్యర్థులను చంద్రబాబు త్వరలో ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు.