ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయాలు ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కన్న కొడుకు కంటే దత్త పుత్రుడే బెటర్. దత్త తండ్రి కళ్లల్లో ఆనందాన్ని నింపేందుకు దత్త పుత్రుడు ఏం చేయడానికైనా వెనుకాడరనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ చర్చంతా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడిపాడే వాడు దత్త పుత్రుడైతే, ఆడించే వాడు దత్త తండ్రి అని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
ఏమీ లేని చోట సమస్య సృష్టించి, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని జనసేన, టీడీపీ కలిసి ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ఇంటి వద్ద ఆయన సెక్యూరిటీ సిబ్బందితో ముగ్గురు మందుబాబులు గొడవ పడితే, దాన్ని రెక్కీగా చిత్రీకరించడం ప్రతిపక్ష పార్టీలకే చెల్లింది. నిజం గడప దాటే లోపు, అబద్ధం లోకమంతా సంచరిస్తుందనే నమ్మకమే వారితో ఇలాంటి దుష్ప్రచారం చేయించడానికి ఉసిగొల్పింది.
అయితే పవన్‌పై రెక్కీ జరగలేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. కానీ వాస్తవాలతో తమకు సంబంధం లేదన్న ధోరణితో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో పాటు ఎల్లో గ్యాంగ్ అంతా ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రచారం చేశాయి. ఇవాళ కూడా పవన్‌కల్యాణ్ తనపై రెక్కీ జరిగిందని చెప్పారంటే, ఆయన ఎవరి కళ్లలో ఆనందం కోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఏదో జరిగిందంటూ పవన్‌కల్యాణ్ అల్లరి చేయడం, ఆయనకు దత్త తండ్రి చంద్రబాబు వత్తాసు పలకడం కుట్రలో భాగమనే ప్రచారాన్ని ఎలా కాదనగలం? పవన్ ఇప్పటం పర్యటనపై మిత్రపక్షమైన బీజేపీ కంటే, టీడీపీ అధినేత చంద్రబాబే ముందుగా స్పందించడం విశేషం. ఈ మేరకు చంద్రబాబు తన దత్త పుత్రుడికి మద్దతుగా ట్వీట్ చేయడాన్ని గమనించొచ్చు.
‘ఈ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుంది. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి…ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే. ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటేనో…. చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి… ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుంది’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
జనసేన మిత్రపక్షమైన బీజేపీ కంటే దత్త పుత్రుడు ఎంత వేగంగా స్పందిస్తున్నారో చూడొచ్చు. కన్న కొడుకు లోకేశ్ ఎప్పుడూ చంద్రబాబుకు ఆనందం కలిగించిన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ దత్త తండ్రి ఆలోచనలు, అంతరంగాన్ని పసిగట్టి, అందుకు తగ్గట్టు దత్తపుత్రుడు నడుచుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దత్త పుత్రుడు ఏం చేసినా, ఏం చేయకున్నా… అంతా దత్త తండ్రిని సంతృప్తిపరచడానికే అనే సెటైర్స్ వెల్లువెత్తడం విశేషం.