విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టారు. తమ ప్రభుత్వ నిర్ణయం ఎలా సరైందో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. పేరు మార్పుపై బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ఎన్టీఆర్ పేరు తొలగింపుపై మెజార్టీ అభిప్రాయం జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్కు జగన్ ఏ రకంగా చూసినా పరాయివాడే. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో జగన్కు ఏ మాత్రం సంబంధం లేదు. ఎన్టీఆర్ బొమ్మతో జగన్ రాజకీయ పునాదులు వేసుకుంది లేదు. తన తండ్రి వైఎస్సార్ ఇమేజ్ను జగన్ రాజకీయంగా సొమ్ము చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్పై తనకు గౌరవం అంటూనే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై భగ్గుమంటున్న వాళ్లకు నిజంగా ఆయనపై ప్రేమ, గౌరవం ఉన్నాయా? వుంటే నాడు ఎన్టీఆర్ను సీఎం సీటు నుంచి ఎందుకు కూలదోశారు? అలాగే బతికి ఉండగానే టీడీపీ నుంచి ఎన్టీఆర్ను ఎందుకు తప్పించారు? టీడీపీకి ఎన్టీఆర్తో సంబంధం లేదని ఎందుకు తేల్చి చెప్పారు? సీఎంగా పదవీచ్యుతుడిని చేసిన తర్వాత అసెంబ్లీలో కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వని పాలకులెవరో జనానికి బాగా తెలుసు.
ఎన్టీఆర్ను సీఎం పీఠంపై నుంచి గద్దె దింపి, చంద్రబాబు అధిరోహించిన మాట నిజం కాదా? అసెంబ్లీలో మాట్లాడేందుకు మైకు ఇవ్వని స్పీకర్గా యనమల రామకృష్ణుడు చరిత్రలో విలన్గా మిగిలిపోలేదా? అలాగే వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్పై రాళ్లు, చెప్పులు విసిరిన మాట ఏంటి? ఈ అవమానంతో పోల్చితే హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం నేరమా? ఎన్టీఆర్ బతికి వుండగానే, ఆయన్ను మానసికంగా హత్య చేసిన ఘనత ఎవరిదో తెలుగు సమాజానికి బాగా తెలుసు.
రాజకీయంగా చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు మనస్తాపం చెందిన ఎన్టీఆర్, పదవీచ్యుతుడైన కొన్నాళ్లకు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో సంగతేంటి? జనానికి మతిమరుపు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వాళ్లే, నేడు ఆయన్ను అవమానించారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. ఎన్టీఆర్పై ఆఫ్ ది రికార్డుగా చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియాధిపతులు ఎంత అసభ్యంగా మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకు రికార్డెడ్ ఆధారాలు కూడా ఉన్నాయి.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినా, అవమానించినా, తమకే హక్కు ఉందని, జగన్ ఎవరని ప్రశ్నించినట్టుగా చంద్రబాబు వైఖరి వుంది. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని ఖండిస్తున్నామని ఆ ప్రెస్నోట్లో పేర్కొంది. అంతా బాగుంది. తండ్రిని బతికి వుండగా చంపేసేలా వ్యవహరించిన వాళ్లే ఆయనకేదో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై నిరసనగా ఉద్యమం పేరుతో తన వెన్నుపోటును మరిపించాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగు సమాజం ఉన్నంత వరకూ తన వెన్నుపోటు చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు గ్రహిస్తే మంచిది. ఇక జగన్ నిర్ణయానికి వస్తే… మంచోచెడో ప్రజలే తేలుస్తారు.