నెక్ట్స్ లెవెల్‌కు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి రాజ‌కీయంగా నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నారు. త‌న కుమారుడికి చంద్ర‌గిరి టికెట్‌ను కూడా ఆయ‌నే ప్ర‌క‌టించుకోవ‌డం విశేషం. త‌ద్వారా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు తానెంత ద‌గ్గ‌రో…

తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి రాజ‌కీయంగా నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నారు. త‌న కుమారుడికి చంద్ర‌గిరి టికెట్‌ను కూడా ఆయ‌నే ప్ర‌క‌టించుకోవ‌డం విశేషం. త‌ద్వారా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు తానెంత ద‌గ్గ‌రో లోకానికి, ముఖ్యంగా వైసీపీ నేత‌ల‌కు చెప్ప‌క‌నే చెప్పారు. జెడ్పీటీసీ స‌భ్యుడిగా వైఎస్సార్ హ‌యాంలో రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన ఆయ‌న‌… వైఎస్ జ‌గ‌న్ హ‌యాం వ‌చ్చే స‌రికి మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి లాంటి బ‌ల‌మైన నాయ‌కురాలిని ఓడించే స్థాయికి ఎదిగారు.

ఎమ్మెల్యేగా రెండు ద‌ఫాలు పూర్తి చేసుకోడానికి ఏడాది స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ఈ లోపు ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల వైపు శ‌ర‌వేగంగా అడుగులు వేసే క్ర‌మంలో ఒక మెట్టు ఎక్కారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుడిగా చెవిరెడ్డి గుర్తింపు పొందారు. వైసీపీకి చెందిన 23 అనుబంధ సంఘాల ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల్ని చెవిరెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారంటే, ఆయ‌న‌పై ఎంత న‌మ్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఇదే సంద‌ర్భంలో విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పుకోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. అన‌తి కాలంలోనే చెవిరెడ్డి సేవ‌ల్ని  వైఎస్ జ‌గ‌న్ గుర్తించారు. సంక్రాంతైనా, ఉగాదైనా… వేడుక ఏదైనా చెవిరెడ్డి తాడేప‌ల్లి సీఎం నివాసంలో ప్ర‌త్య‌క్ష‌మ‌వడం కొంత‌కాలంగా అంద‌రూ చూస్తున్న విష‌య‌మే.  

“నువ్వుండాల్సింది చంద్ర‌గిరిలో కాదు, నా వెంట” అని జ‌గ‌న్ అన్నారని చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించ‌డం విశేషం. వైఎస్ జ‌గ‌న్ ఆదేశాల‌ను శిర‌సా వ‌హించి సీఎం వెంట న‌డిచేందుకు వెళుతున్నాన‌ని, చంద్ర‌గిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా త‌న కుమారుడు మోహిత్‌రెడ్డి బ‌రిలో ఉంటార‌ని చెవిరెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

జ‌గ‌న్ వెంట వుంటూ…చ‌క్క‌దిద్దాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని చెవిరెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చెప్పారు. ఆ బృహ‌త్ సంక‌ల్పంలో భాగంగా వెళుతున్న త‌న‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించాల‌ని, అలాగే చంద్ర‌గిరిలో త‌న‌ను ఆశీర్వ‌దించిన‌ట్టే మోహిత్‌రెడ్డిని కూడా నిండు మ‌న‌సుతో ఆద‌రించాల‌ని వేడుకున్నారు.

చెవిరెడ్డిని జ‌గ‌న్ ర‌ప్పించుకోవ‌డం ద్వారా …సీఎం కొత్త టీమ్ నెమ్మ‌దిగా ఏర్పాట‌వుతోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. జ‌గ‌న్‌కు చెవిరెడ్డి చేరువ అవుతున్న క్ర‌మంలో చంద్ర‌గిరి ఎమ్మెల్యే చూపుతున్న చొర‌వ‌ను ముఖ్యంగా వైసీపీ నేత‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. మ‌రోవైపు విజ‌య‌సాయిరెడ్డి , త‌దిత‌ర నేత‌లు దూర‌మ‌వుతుండ‌డాన్ని కూడా గ్ర‌హించొచ్చు. 

వైసీపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు ఇది సంకేతంగా భావించొచ్చు. రాజ‌కీయంలో అంచెలంచెలుగా ఎద‌గాల‌ని అనుకునే వారికి చెవిరెడ్డి ఒక రోల్ మోడ‌ల్. అలాగే చెవిరెడ్డికి ద‌క్కుతున్న ప్రాధాన్యం దృష్ట్యా  జ‌గ‌న్ మ‌న‌సును గెలుచుకోవ‌డం ఎలాగో ఎవరికి వారు అంచ‌నా వేసుకోవ‌చ్చు.