రాజకీయ జ్యోతిష్యులు అందరూ ఉద్ధండులే! మహా మేధావులే. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా మేరకే వారి జ్యోతిష్య ఫలితాలు వెలువరిస్తూ ఉంటారు. మామూలు జ్యోతిష్యులు కూడా ఒకే విషయం గురించి రకరకాల ఫలితాలు చెప్పేసి.. తాము ఒక్కొక్కరూ ఒక్కొక్క పంచాగం ఫాలో అవుతుంటామని బుకాయించినట్టుగా.. ఈ రాజకీయ జ్యోతిష్యులు తమ తమ స్వార్థ స్వప్రయోజనాల ఎజెండాను ఫాలో అవుతుంటారు.
అలాంటిది.. ఇప్పుడు సరికొత్త రాజకీయ జ్యోతిష్యుడు రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పది సీట్లు కూడా రావని జోస్యం చెబుతున్నారు. ఆ జ్యోతిష్యుడు మరెవ్వరో కాదు.. మాజీ కేంద్ర మంత్రి, తిరుపతికి చెందిన నాయకుడు చింతా మోహన్!
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తర్వాత కాంగ్రెసులోకి వెళ్లి అక్కడ కూడా ఎంపీగా గెలిచి.. సోనియాగాంధీ కుటుంబంతో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి.. మంత్రి పదవిని కూడా దక్కించుకున్ని చింతామోహన్ ఒక్కసారిగా సెలబ్రిటీ నేత అయిపోయారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సంగతి.. తన పేరును ప్రమాణస్వీకారాల సమయంలో పిలిచేదాకా తెలియకుండా బతికిన నాయకుడు ఆయన.
ఎన్నికల సమయంలో తప్ప.. నియోజకవర్గంలో అయదేళ్లలో ఎవ్వరికీ కనిపించకపోయినా సరే.. చాలాసార్లు గెలిచిన రికార్డు ఆయన సొంతం. అలాంటి చింతా మోహన్ రాష్ట్ర విభజన తర్వాత.. శిథిల కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుల్లో ఒకరుగా వెలుగొందుతున్నారు.
సదరు చింతామోహన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 151 సీట్లతో అధికారం చెలాయిస్తున్న, తాము చేపడుతున్న సంక్షేమ పథకాల కారణంగా.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను కూడా గెలుచుకోగలం అని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా ఘోరంగా ఛీత్కరించుకునే వాతావరణం కనిపిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పది సీట్లు కూడా రావడం కష్టమేనని ఆయన జోస్యం చెబుతున్నారు.
ఎలాంటి అవగాహన, అంచనాలతో ఆయన ఈ మాటలు చెబుతున్నారో తెలియదు. వెంకటగిరి సభలో జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుల మీద విపరీత ఆరోపణలు చేశారని ఆవేదన చెందుతున్న చింతా మోహన్.. అసలు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఏనాడో దారి తప్పిపోయాయని గుర్తించలేదో ఏమో అర్థం కావడం లేదు. ఆయన అవగాహనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ కు ఓటు వేయరట.
తన జోస్యంలో తేడా వస్తే.. ఎలాంటి త్యాగాలకు సిద్ధపడతాడో కూడా చింతా చెప్పి ఉంటే బాగుండేది. ఈ నవీన జ్యోతిష్యుడు వైసీపీ ఓడిపోతుందని అంటున్నారు గానీ.. పనిలో పనిగా ఏపీలో కాంగ్రెస్ 2024లో అధికారంలోకి వచ్చేస్తుందని కూడా సెలవిస్తే.. ఆయన మాటలు విని ప్రజలు ఇంకా హాయిగా నవ్వుకుంటారు.