పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎంపీ అభ్యర్ధిగా పోలింగ్ సరళిని పరిశీలించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలా పోలింగ్ తీరుని చూసుకోకుండా ఓటర్లను లాస్ట్ మినిట్ లో కూడా ప్రలోభ పెట్టాలని చూడడం ఏ రకమైన కక్కుర్తి అని అంటున్నారు అంతా.
ఎక్కడ నుంచో పారా చూట్ వేసుకుని అనకాపల్లిలో దిగిన సీఎం రమేష్ ఎంపీగా రెండు లక్షల మెజారిటీతో గెలుస్తాను అని రెండు రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు. అంత ధీమా ఉన్న ఆయన పోలింగ్ సమయంలో సైతం ఓటర్ల వద్దకు వచ్చి కూటమికే ఓటు వేయండి అని అభ్యర్థించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆయన పెందుర్తిలోని రెండు పోలింగ్ బూతులను సందర్శించి అక్కడ పోలింగ్ తీరుని వాకబు చేశారు. ఓటు వేసే క్యాబిన్ వద్దకు కూడా వెళ్ళి నిశితంగా పరిశీలన చేశారు.
అక్కడితో ఆగితే బాగుండేది. ఓటర్లకు దండం పెట్టి వెళ్ళిపోయినా సరిపోయేది. కానీ ఆయన పేరులో సీఎం ఉంది కదా. ఆ దర్జా దర్పం ఆయన్ని మామూలుగా ఎపుడూ ఉండనీయవు కదా. అందుకే ఆయన ఓటర్ల వద్దకు వెళ్ళి మరీ ఓట్లు కూటమికి వేయండి అంటూ ప్రచారం మొదలెట్టేశారు
దీని మీద కొందరు ఓటర్ల నుంచే అభ్యంతరం వ్యక్తం అయింది. ఓటు అన్నది సీక్రెట్ వ్యవహారం. దాదాపుగా రెండు నెలల పాటు విపరీతమైన ప్రచారం చేసి చెప్పాల్సింది చెప్పుకున్నారు. ఇపుడు ఓటరు తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆ తీర్పుని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించాలని ఎవరు చూసినా తప్పే. సీఎం రమేష్ వైఖరి పట్ల వైసీపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.