ఈ నెల 29న తిరుపతిలో తలపెట్టిన సీమ ఆత్మగౌరవ మహాప్రదర్శనకు తరలి రావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈ మహాప్రదర్శన చేపట్టినట్టు చెప్పారు. సీమ ఆకాంక్షలను వెల్లడించేందుకు ఈ మహాప్రదర్శన అంకురార్పణగా అభివర్ణించారు.
రాయలసీమ ఆత్మగౌరవానికి, అమరావతి ధనిక, భూస్వాముల మధ్య వాగ్వాదంగా తాను నిర్వహించే మహాప్రదర్శన గురించి చెప్పుకొచ్చారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం కావాలనే వాళ్ల అత్యాశను, గొంతెమ్మ కోర్కెలను ఇతర ప్రాంతాలు ఇకపై భరించలేవన్నారు.
వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 45 వేల క్యూసెక్కులకు పెంచితే, అందుకు నిరసనగా ప్రకాశం బ్యారేజీపై నిరసనకు దిగారన్నారు. రాయలసీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకూడదనే ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మహా ద్రోహమని విరుచుకుపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ తోడ్పడరని తేలిపోయిందన్నారు. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అమరావతి శాసన రాజధానిగా వుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతుండడాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ రాజధాని తరలించుకుపోతున్నారని తమపై నీలాపనిందలు వేస్తున్నారని కరుణాకరరెడ్డి విమర్శించారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చిన వెంటనే రాయలసీమ అంతా అభివృద్ధి చెందదన్నారు. న్యాయ రాజధాని రావడం వల్ల రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి ఒక తృప్తి కలుగుతుందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకున్న 85 ఏళ్ల తర్వాత రాయలసీమకు న్యాయం జరగబోతుందన్న నమ్మకం, విశ్వాసం తమకు కలిగించిన వాళ్లవుతారన్నారు.
సైబరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు చర్యల వల్ల నాడు ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయంలో 2/3 వంతు హైదరాబాద్ నుంచి మాత్రమే వచ్చిందన్నారు. అలాంటి హైదరాబాద్‌ను పోగొట్టుకున్న తర్వాత ఇవాళ రాష్ట్ర రెవెన్యూ లోటు ఎంత వుందో అందరికీ తెలిసిందే అన్నారు. లక్షల కోట్ల సొమ్మును ఒకే చోట అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే, బాధ పడిన మనసులు తిరగబడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీసే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు చంద్రబాబు చర్యలే కారణమవుతాయన్నారు.
చంద్రబాబు చేసేది న్యాయం కాదని, మిగిలిన రెండు ప్రాంతాల గౌరవం నిలపాలని, ఆ ప్రాంతాల అభివృద్ధికి తొలి అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని చెప్పుకొచ్చారు. ఈ నెల 29న తిరుపతి కేంద్రంగా తలపెట్టిన మహాప్రదర్శన సీమ ఉద్యమ ఆకాంక్షకు బీజం వేయనుందని ఆయన అన్నారు.