శెభాష్.. కోడికత్తి శీనుకు అభినందనలు!

అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో హత్యాయత్నం చేసినందుకు.. ఇన్నాళ్లుగా విశాఖ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న జనిపల్లి శ్రీనివాసరావు.. తాజాగా బెయిలుపై విడుదల అయ్యారు. సినిమాటిక్…

అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో హత్యాయత్నం చేసినందుకు.. ఇన్నాళ్లుగా విశాఖ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న జనిపల్లి శ్రీనివాసరావు.. తాజాగా బెయిలుపై విడుదల అయ్యారు. సినిమాటిక్ ధోరణిలో, చేతిలో అంబేద్కర్ చిత్రపటం ఒకటి పట్టుకుని జైలునుంచి కోడికత్తి శ్రీను బయటకు రావడం జరిగింది. న్యాయవాదులు అతనిని, తండ్రి తాతారావుకు అప్పగించారు.

ఇప్పుడు కోడికత్తి శీను ఎంతో సంచలనాత్మకమైన వార్తల్లో వ్యక్తి. కోడికత్తి శీనును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిమీద నానా రకాల నిందలు వేయడానికి పచ్చ పార్టీలు పచ్చ మీడియా ఇన్నాళ్లుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు శీను బయటకు వచ్చాడు గనుక.. అతని ఇంటర్వ్యూల కోసం ఎగబడే వారు చాలామందే ఉంటారు. శాటిలైట్ ఛానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు శీనుతో మాట్లాడి.. ఎంత విలక్షణమైన కంటెంట్ ఆయన మాటల్లో దొరికితే దానిని హైలైట్ చేసి బతకాలని ఉవ్విళ్లూరుతుంటారు. శీను కోసం ఎగబడే వారి ‘అతి’ని మనం కొన్నాళ్ల పాటు భరించాల్సిందే తప్పదు.

కానీ.. కోడికత్తి శీనుకు ముందుగా అభినందనలు చెప్పాలి. నేరానికి పాల్పడినందుకు విచారణ ఖైదీగా ఉంటూ.. ఇన్నాళ్లకు శిక్ష సంగతి తేలకపోయిన బెయిలుపై బయటకు వచ్చినందుకు కాదు మనం అభినందించాల్సింది. శీను ఖాతాలో మరో ఘనత ఉంది. అతను జైల్లో  ఉంటూనే బీఏ డిగ్రీ చదువు పూర్తిచేశాడు. 

అవును ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ ఘనతను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగానే సాధించాడుట. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విధానంలో శీను జైల్లో ఉండగా బీఏ జాయిన్ అయి. ఏకంగా 70 శాతం మార్కులతో పూర్తి చేశాడుట. అందుకు మనందరం కూడా శీనును అభినందించాలి.

అతడు జగన్ మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడా లేదా? కోడికత్తి దాడివెనుక ఉన్న వ్యూహం ఎవరిది వంటి విషయాలు పూర్తిగా విస్మరిద్దాం. కానీ అలాంటి నేరానికి పాల్పడినందుకు ఒక సీరియస్ కేసులో విచారణ ఖైదీగా ఉన్నప్పుడు ఎంతటి మానసిక ఒత్తిడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒత్తిడిలో ఉంటూ కూడా.. శీను ఓపెన్ వర్సిటీలో చేరి చదువుకుంటూ బీఏ పూర్తి చేయడం.. అది కూడా 70 శాతం మార్కులు సాధించడం అనేది గమనించాల్సిన సంగతి. అందుకే శీనుకు అభినందనలు తెలియజేయాలి.

ఏదైనా ఒక వ్యవహారం తారసపడినప్పుడు పూర్తిగా రాజకీయ కోణాల్లో అంశాలు మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడూ ఇతర కోణాల్లోంచి కూడా ఆ వ్యవహారాన్ని గమనించడం మనం అలవరచుకోవాలి.