ఒకే గొడుగు అంటున్న గిడుగు…… బాబు ఓకే చెబుతారా…?

ఏపీలో ఒంటరిగా వెళ్ళే ఆలోచన అయితే తెలుగుదేశానికి లేదు. ఈ విషయం అందరూ చెబుతున్నదే. టీడీపీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఘోర పరాభవం ఎదురైంది. 2024 లో మాత్రం అందరినీ కలుపుకుని పోవాలని…

ఏపీలో ఒంటరిగా వెళ్ళే ఆలోచన అయితే తెలుగుదేశానికి లేదు. ఈ విషయం అందరూ చెబుతున్నదే. టీడీపీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఘోర పరాభవం ఎదురైంది. 2024 లో మాత్రం అందరినీ కలుపుకుని పోవాలని టీడీపీ చూస్తోంది.

మరీ ముఖ్యంగా జనసేన బీజేపీలతో కలసి 2014 పొత్తులను 2024 లో రిపీట్ చేయాలని చూస్తోంది. జనసేన సంగతి ఎటూ తేలడం లేదు, బీజేపీ నుంచి పాజిటివ్ రియాక్షన్ లేదు. ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ గా నియమితులైన గుడుగు రుద్రరాజు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ఏపీలో తాము ఎవరితోనైనా పొత్తులకు రెడీ అన్నారు. అయితే వైసీపీ, బీజేపీలకు మాత్రం దూరం అని ఆ రెండు పార్టీలను ఓడించడానికి ఏ కూటమితో అయినా సిద్ధమని స్పష్టం చేసారు. ఆయన చెబుతున్న దాని బట్టి చూస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన వంటివి కలసి పోటీ చేయాలని ఉంది అంటున్నారు. ఇది ఒక విధంగా చూస్తే 2009  నాటి మహా కూటమిని తలపిస్తోంది.

పీసీసీ కొత్త చీఫ్ అయ్యాక ఉత్సాహంతో ఆయన చెప్పిన మాట ఇది. అంతే కాదు చంద్రబాబు ఎవర్ గ్రీన్ నినాదానికి రుద్రరాజు మద్దతు ఇస్తూ మాట్లాడారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి అని ఆయన గట్టిగా పేర్కొన్నారు.

టీడీపీ విషయానికి వస్తే చివరి క్షణం వరకూ బీజేపీతో పొత్తు కోసం చూస్తుందని అది కనుక వీలు కాకపోతే అంది వచ్చిన పార్టీలను కలుపుకుని కూటమి కడుతుంది అని చెబుతున్నారు. అలా చూసుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ తరువాత రెండవ పెద్ద పార్టీ కాబట్టి హస్తంతో టీడీపీ చెలిమి చేసినా ఆశ్చర్యం లేదు. ఈ పొత్తులు 2018లో తెలంగాణాలో కొనసాగించినవే కాబట్టి గిడుగు రుద్రరాజు పొత్తు ఆశలు నెరవేరవచ్చునేమో.