పార్టీ ఆఫీసులకోసం ఇలా మెట్టు దిగడం ఎందుకు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో వివాదాలురేగుతున్నాయి. చాలాచోట్ల భూముల కేటాయింపు అనేది వివాదాస్పదం అవుతోంది. రెండెకరాల జాగాను…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో వివాదాలురేగుతున్నాయి. చాలాచోట్ల భూముల కేటాయింపు అనేది వివాదాస్పదం అవుతోంది. రెండెకరాల జాగాను ఏడాదికి రూ.1000 వంతున లీజుకు, మరోచోట 1.75 ఎకరాలా జాగాను ఏడాదికి రూ.1750 వంతున లీజుకు తీసుకునే వ్యవహారాలు చర్చనీయాంశం అవుతున్నాయి.

సహజంగానే.. ప్రభుత్వ నిర్వహణలో ఏ చిన్నలోపం దొర్లుతుందా.. రాద్ధాంతం చేద్దామా అని నిరీక్షిస్తూ ఉండే ప్రతిపక్షాలు ఈ విషయంలో కూడా నానా రగడ చేస్తున్నాయి. పచ్చమీడియా కోడై కూస్తోంది. వారు గొడవ చేస్తున్నారని అనడం కంటె వారు గొడవ చేయడానికి ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందంటే బాగుంటుంది. 

నిజానికి, ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే నిందించాల్సిన విషయం కాదిది. ప్రభుత్వంలో ఉండే పార్టీలు తమ తమ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేయడం, లీజుకు ఇవ్వడం ప్రతిచోటా జరిగేదే. ఇది కొంత చౌకబేరంగానే జరుగుతూ ఉంటుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ, జగన్ గానీ.. చాలా వ్యవహారాల్లో ఇతర పార్టీల ధోరణుల్లో నడవకుండా తాను రోల్ మాడల్ గా నిలుస్తూ పాలన సాగిస్తున్నారు. అలాంటిది ఈ విషయంలో మాత్రం ఎందుకు ఒక మెట్టు దిగి అందరిలాగానే వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కాని సంగతి. 

జగన్ లేదా వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ప్రజల హృదయాలను గెలుచుకుంటూ పాలన సాగిస్తారనే అనుకుంటున్నారు. అలాంటప్పుడు.. లీజు స్థలాల్లో ఎందుకు, కొన్న స్థలాల్లోనే శాశ్వతమైన పార్టీ భవనాలనే నిర్మించుకోవచ్చు కదా అనేది ప్రజల సందేహం. ప్రభుత్వంనుంచి తీసుకోవడం ఆచారమే అయినప్పటికీ.. లీజు రూపంలో విమర్శలకు తావిచ్చేలా కాకుండా.. అధికారికంగా ఆ ప్రాంతంలో ఉండే మార్కెట్ ధర చెల్లించి పార్టీ తరఫున కొనుగోలు చేయడం వైసీపీకి పెద్ద ప్రయాసకాదు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. 

విధానాల పరమైన నిర్ణయాల విషయంలో విపక్షాల విమర్శలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. కానీ.. పార్టీ సంస్థాగత విషయాలు, అది కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి.. అధికారంలో ఉన్నారు గనక ప్రభుత్వానికి రాగల రాబడిని దోచుకుంటున్నారు అనే భావన వ్యాపించకుండా.. మార్కెట్ ధరకు ఆస్తిని పూర్తిగా కొనేసుకుంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది కదా అనే భావన ప్రజల్లో కూడా ఉంది. 

నిజానికి వైసీపీ ఇవాళ పుట్టిన పార్టీ కాదు. ఆయా ప్రాంతాల్లో వారికి ఇన్నాళ్లుగా పార్టీ కార్యాలయాలు లేకుండాపోయింది కూడా లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా కార్యాలయాలు కావాలనుకున్నా సరే.. సర్కారు భూముల్ని మార్కెట్ ధరకు కొంటే బాగుండేదని, ఇతర పార్టీలకు కూడా తాము రోల్ మాడల్ గా నిలవగల అవకాశాన్ని జగన్ మిస్ చేసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు.