తెలుగుదేశంలో పేరుకే చంద్రబాబు నాయకత్వం. అంతా లోకేశ్ పెత్తనమే. తాజాగా యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలవడంతో టీడీపీలో లోకేశ్ అధికారం మరింత బలోపేతం అవుతోంది. ఇక మీదట లోకేశే అంతా చూసుకుంటారనే సంకేతాల్ని చంద్రబాబు పరోక్షంగా పంపారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తే మాత్రం…. టీడీపీలో లోకేశ్ మాటకు తిరుగుండదు.
టీడీపీ భవిష్యత్ సారథి లోకేశే అనే ప్రచారం విస్తృతం కావడంతో ఆయన చల్లని చూపు కోసం పరితపించే వాళ్లు లేకపోలేదు. నిన్నటి పాదయాత్ర సభలో కూడా సగం మంది యువతే ఉన్నారని అచ్చెన్నాయుడు మొదలు నేతలంతా చెప్పడం గమనార్హం. ఇదంతా లోకేశ్ టీమ్‌గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సహజంగానే టీడీపీలో తమ అధికారానికి, నాయకత్వానికి కోత పడుతోందనే ఆవేదన కొంత మంది సీనియర్ నేతల్లో కనిపిస్తోంది.
టీడీపీ సీనియర్ నేతల మధ్య అంతర్గత సంభాషణల్లో లోకేశ్ తీరుపై మండిపడుతున్నారని సమాచారం. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్, పరిటాల సునీత తదితర నాయకులు తెరమరుగు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండానే బాబు నిర్మొహ మాటం వల్ల యనమల , సోమిరెడ్డి తదితర నాయకులు టీడీపీలో ఇంకా పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాళ్లందరికీ లోకేశ్ వ్యవహార శైలి ఏ మాత్రం నచ్చడం లేదు.
ప్రస్తుతం లోకేశ్ కోటరీలో పట్టాభి, వంగలపూడి అనిత, చింతకాయల విజయ్, దీపక్‌రెడ్డి , బొజ్జల సుధీర్‌రెడ్డి తదితర పైకి కనిపించే, కనిపంచని నేతలున్నారు. లోకేశ్ కోటరీ బ్యాచ్‌ను గమనిస్తే…. బాబు కోటరీ ఎంతో బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ కోటరీలో ఎక్కువగా చిల్లర బ్యాచ్ ఉన్నారనే విమర్శలు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. లోకేశ్‌పై అక్కసుతో సీనియర్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆ యువనాయకుడి సన్నిహితులు విమర్శిస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా రానున్న కాలంలో లోకేశ్, ఆయన కోటరీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.