అయ్యన్నకు కనిపించేలా అభివృద్ధి

మాట్లాడితే చాలు మేము సీనియర్లమని తెలుగుదేశం నేతలు చెబుతారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేశామని అంటారు. కానీ సొంత నియోజకవర్గం కేంద్రం అయిన చోట రోడ్లు చూస్తే ఇరుకుగా మురికిగా కనిపిస్తాయి. అలాంటి…

మాట్లాడితే చాలు మేము సీనియర్లమని తెలుగుదేశం నేతలు చెబుతారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేశామని అంటారు. కానీ సొంత నియోజకవర్గం కేంద్రం అయిన చోట రోడ్లు చూస్తే ఇరుకుగా మురికిగా కనిపిస్తాయి. అలాంటి చోట రోడ్ల విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అనకాపల్లి జిల్లా నర్శీపట్నంలో ప్రస్తుతం ఉన్న నలభై అడుగుల రోడ్డుని ఎనభై అడుగులుగా విస్తరించేందుకు జగన్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల 30న నర్శీపట్నం రానున్న జగన్ రోడ్డు విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

నర్శీపట్నం మునిసిపాలిటీలో చాలా కాలం టీడీపీ అధికారంలో ఉంది. దశాబ్దాల పాటు అక్కడ నుంచే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గెలుస్తూ వస్తున్నారు. నర్శీపట్నం ఇపుడు కీలకమైన పట్టణంగా ఎదుగుతోంది. రోడ్ల విస్తరణ డిమాండ్ చాలాకాలంగా ఉన్నా ఎందుకు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి ముప్పయి ఏళ్ళు వెనకబడిపోయింది అని విమర్శలు చేస్తున్న అయ్యన్నపాత్రుడు నలభై అడుగుల రోడ్డుని ఎనభై అడుగులకు విస్తరించడం అభివృద్ధి కాదని చెప్పగలరా అని సవాల్ చేస్తున్నారు. నర్శీపట్నం వంటి మారుమూల ప్రాంతానికి అయిదు వందల కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ప్రగతి కాదంటారా అని నిలదీస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలతో జగన్ నర్శీపట్నంలో చేపట్టే అభివృద్ధి పనులను చూసి అయినా టీడీపీ నేతలు విమర్శలు మానుకోవాలని కోరుతున్నారు.