వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పోటీకి దూరం అంటున్నారు. ఇదే విషయం తాను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి చెప్పాను అని అంటున్నారు. అయితే జగన్ మాత్రం ఒప్పుకోవడం లేదని ఈ ఒక్కసారికీ పోటీ చేయమని సూచించారు అని ధర్మాన చెప్పడం విశేషం.
ఏపీలో చూస్తే చాలా మందికి సీట్లు చిరిగిపోతున్నాయి. అయితే ధర్మాన విషయం వేరుగా ఉంది అని అంటున్నారు. ఆయన పోటీకి దూరం అని అంటున్నా టికెట్ ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ధర్మానకు ఎందుకు రాజకీయ వైరాగ్యం అంటే తాను అనేక ఎన్నికలు చూశాను అని అంటున్నారు.
ధర్మాన వయసు ఆరున్నర పదులు దాటి ఉంది. కానీ ఆయన కంటే చాలా మంది పెద్దవారు రాజకీయంగా చురుకుగా ఉంటున్నారు. ధర్మాన ఈ రోజుకీ బాగానే పనిచేస్తారు. ఆయన ధాటీగానే మాట్లాడుతారు. అటువంటి ఆయన రాజకీయ రిటైర్మెంట్ అని ఎందుకు అంటున్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం.
అయితే ధర్మాన గురించి మరో ప్రచారం సాగుతోంది. ఆయన ఈసారికి తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇప్పించుకుని తాను పోటీ నుంచి తప్పుకోవాలని చూశారు అని అంటున్నారు. చాలా మంది అలాగే ఆలోచించారు. వారిలో కొందరు తండ్రులకు ఆ అదృష్టం వరించింది. వారి కుమారులకు వైసీపీ టికెట్ ఇచ్చింది.
అదే విధంగా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు అన్నది ప్రచారం. అయితే ధర్మాన ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు శ్రీకాకుళంలో. సీనియర్ నేతగా అనుభవశాలిగా వ్యూహకర్తగా ధర్మాన పోటీ చేస్తేనే సేఫ్ అని ఆలోచించే అధినాయకత్వం ఆయన కుమారుడి విషయం పక్కన పెట్టిందని ప్రచారంలో ఉన్న మాట.
దాంతో ధర్మాన తాను పోటీ చేసేది లేనిదీ ప్రజలే నిర్ణయిసారు అని అంటున్నారు. ఇలా శ్రీకాకుళం జిల్లాలో ఈ సీనియర్ మంత్రి పోటీ విషయం అయితే రసకందాయంలో పడింది అని అంటున్నారు. ధర్మాన పోటీకి నో అని పూర్తిగా అంటే మాత్రం అక్కడ కొత్త ముఖాన్ని వైసీపీ చూసుకోవాల్సి ఉంటుంది. అధికార పార్టీకి అటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని అంటున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో వర్గ పోరు సాగుతూంటే వైసీపీలో పోటీకి నో అంటున్నారు మంత్రి. ఇది ఒకింత విడ్డూరంగా ఉన్నా ఉత్తరాంధ్రాలో సీనియర్ నేతల విషయంలో వైసీపీ ఈసారికి పోటీ చేయించాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. అయిదవ జాబితాలో ఏముందో తొందరలో తేలనుంది.