ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. మూడో ఏడాది లబ్ధి సొమ్ము అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను కూడా అనర్హుల జాబితాలో వేయడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల మధ్య సమాచార లోపం కారణంగా సమస్య ఉత్పన్నమైంది. మొదటి విడత నాటికి విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకోకుండానే లబ్ధి చేకూర్చారు. అయితే రెండో ఏడాదికి వచ్చే సరికి విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు వుంటేనే, లబ్ధి అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచిదే.
అయితే మూడో విడతకు వచ్చే సరికి విద్యార్థుల హాజరు పంపాలనే సమాచారాన్ని అందజేయలేదు. దీంతో హాజరు లేదనే కారణంతో అమ్మ ఒడికి అనర్హులంటూ తాజా జాబితాలో రిమార్క్ చూపడం విమర్శలకు తావిచ్చింది.
గత రెండు విడతల్లో అర్హులైన తాము, మూడో విడతకు వచ్చే సరికి ఎలా అనర్హులయ్యామనే నిలదీతలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. చివరికి స్కూళ్ల నుంచి హాజరు వివరాలు వెళ్లకపోవడం వల్లే అనర్హుల జాబితాలో చేర్చినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరు వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచి, తప్పును సరిదిద్దాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
కానీ విద్యార్థుల హాజరు వివరాలను నమోదును ప్రభుత్వం నిలిపివేసినట్టు విద్యాశాఖ అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అంతిమంగా ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కావున విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, వివరాలు నమోదు చేసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత వుంది.