సినీ నటి కరాటే కల్యాణి కనిపించట్లేదు. దత్తత పేరుతో పిల్లల అక్రమ రవాణాకు కరాటే కల్యాణి పాల్పడుతోందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు అందడం, వారు వెళ్లి ఆమె ఇంట్లో సోదాలు చేయడం తెలిసిందే. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో కల్యాణి ఇంట్లో లేరు. కల్యాణి తల్లి విజయలక్ష్మి, సోదరుడు మాత్రమే ఉన్నారు. పిల్లల దత్తత విషయమై వారి నుంచి వివరాలు సేకరించారు.
తన కూతురు కరాటే కల్యాణి నిన్నటి నుంచి కనిపించలేదని తల్లి విజయలక్ష్మి ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవేదన పంచుకున్నారు. పిల్లల అక్రమ రవాణాకు కల్యాణి పాల్పడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన కూతురిని బెదించాడన్నారు.
తన కుమార్తె కల్యాణి, దత్తపుత్రిక మౌక్తిక (ఐదు నెలలు)ను ఎవరు తీసుకెళ్ళారో తెలియడం లేదన్నారు. అసలు వాళ్లిద్దరూ ఎక్కడ ఉన్నారో పోలీసులే చెప్పాలని విజయలక్ష్మి డిమాండ్ చేయడం గమనార్హం. చైల్డ్ వెల్ఫేర్ వారు తన ఇంటికి వచ్చి.. చిన్న పిల్లల్ని అక్రమంగా తీసుకొచ్చారా అని ప్రశ్నించారన్నారు.
వాస్లవాలేంటో వారికి చెప్పామన్నారు. తన కుమార్తె కల్యాణి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం కరాటే కల్యాణి అదృశ్యం కావడానికి కారణాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
పిల్లల దత్తత లేక యూట్యూబర్‌పై దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్‌కు భయపడి స్నేహితుల దగ్గర తలదాచుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాటే కల్యాణి తన ఆవేశ ప్రవర్తనతో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్యాణి తప్పు చేయడం వల్లే తప్పించుకుని తిరుగుతున్నారనే ప్రచారానికి బలం కలుగుతోంది.