ఒకవైపు వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా వుందంటూనే, మరోవైపు ఇంకా తాను ఆ పార్టీ నేతగా చెప్పుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గతంలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 2009లో చివరి సారిగా ఆయన వైఎస్ హవాలో మైదుకూరు నుంచి గెలుపొందారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో డీఎల్ చోటు దక్కించుకున్నారు.
నోటి దురుసుతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. మారిన రాజకీయ, కాలమాన పరిస్థితుల్లో ఇక తనకు భవిష్యత్ లేదనే బెంగ ఆయనతో ఏవేవో మాట్లాడిస్తోంది. 2014 ఎన్నికల సందర్భంలో టీడీపీ, ఆ తర్వాత ఎన్నిలకు వచ్చే సరికి వైసీపీ… ఇప్పుడు ఆయన ఏ పార్టీలో వున్నారో జనానికి తెలియని పరిస్థితి. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ… ఎల్లో మీడియాకు ఇష్టుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఇవాళ కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిపాలన మొదటి రోజు నుంచే సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మంచి పరిపాలన అందిస్తానని ఎన్నికలకు ముందు తనతో జగన్ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదన్నారు.
ఈ దఫా వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పన్నారు. ఏపీని చంద్రబాబునాయుడు తప్ప మరొకరు కాపాడలేరన్నారు. 1995లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వుందని గుర్తు చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సక్రమ మార్గంలో పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. చిత్తశుద్ధి వుంటే ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి మెరుగుపరచ వచ్చన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిజాయతిపరుడని కితాబిచ్చారు. ఆయన నిజాయతీని ఎవరూ ప్రశ్నించలేమన్నారు. పవన్‌లో పరిపాలన సమర్థత లేదన్నారు. రాష్ట్రం కోసం వాళ్లిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నట్టు చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానన్నారు. తనను వారు తీసేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు ఉన్న పార్టీ తరపునే పోటీ చేస్తానన్నారు.
సిగ్గుపడుతూ కూడా వైసీపీలో ఉన్నానని డీఎల్ చెప్పడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇలా మాట్లాడ్డానికి సిగ్గులేదా? అని నిలదీస్తున్నారు. అసలు డీఎల్‌ను వైసీపీ నాయకుడిగా ఎవరూ గుర్తించలేదని, అందుకే ఆయనకు కడుపు మంట అని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సిగ్గుంటే తమ పార్టీలో ఉన్నానని చెప్పుకోవద్దని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు.