ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9,10లోని సంస్థలతో పాటు మరో 12 సంస్థల ఆస్తుల విభజన చేయాలంటూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించడం మంచి పరిణామం. ఇంకా విభజనకాని ఆస్తుల విలువ రూ.1,42,610 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. రాజకీయ, పరిపాలన అనుభవం వుందని చంద్రబాబుకు పట్టం కడితే, సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న నేతగా ఆయన మిగిలారు.
విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశారంటే, కొట్టి పారేయలేని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ఆస్తులపై చంద్రబాబు దృష్టి సారించి వుంటే ఇవాళ ఈ పరిస్థితి వుండేది కాదు. ఇక రెండేళ్లలో విభజన చట్టం కాలపరిమితి ముగియనుంది. కనీసం ఇప్పుడైనా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులపై జగన్ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగడం అభినందనీయం.
ఇదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా జగన్ సర్కార్ న్యాయ పోరాటం చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మోదీ సర్కార్ తన పార్టీ ఏలుబడిలోని రాష్ట్రాలు తప్ప, మిగిలిన రాష్ట్రాల వేడుకోళ్లను పట్టించుకోవడం లేదు.
ఏ రాష్ట్రమైన హక్కుల విషయమై నిలదీస్తే… అక్కడి పాలక పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయపెడుతుండడాన్ని చూస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి వుంది. అయితే చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్రమే చూసుకుంటుందని చెప్పారు. దీంతో పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంది.
ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి తగినంతగా నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజానీకంతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోంది. ఇదేమని ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఏపీ రాజకీయ పార్టీలకు లేవు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేస్తున్నా అడ్డుకునే దిక్కులేదు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే వుంది. కనీసం ఇప్పుడైనా కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన వాటిని సాధించేందుకు జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… రాజకీయంగా కూడా తప్పక ప్రయోజనం వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ ఒక్క పని చేసేందుకు జగన్ సాహసిస్తారా?