ఇదేం ఖ‌ర్మ దేవినేని ఉమా….!

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు క‌ష్ట‌కాలం ఎదురైంది. మైల‌వ‌రం నుంచి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావిస్తున్న ఉమాకు… టీడీపీ చెక్ పెట్టే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రోజురోజుకూ ఉమా 0వ్య‌తిరేక వ‌ర్గం బ‌ల‌ప‌డుతోంది.…

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు క‌ష్ట‌కాలం ఎదురైంది. మైల‌వ‌రం నుంచి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావిస్తున్న ఉమాకు… టీడీపీ చెక్ పెట్టే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రోజురోజుకూ ఉమా 0వ్య‌తిరేక వ‌ర్గం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం… మైల‌వ‌రంలో దేవినేని రాజ‌కీయానికి కౌంట్ డౌన్ మొద‌లైంద‌నే సంకేతాల్ని ఇస్తోంది.

టీడీపీ నేత బొమ్మ‌సాని సుబ్బారావు నేతృత్వంలో ఇవాళ మైల‌వ‌రంలో ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మైల‌వ‌రం టీడీపీ ఇన్‌చార్జ్ అయిన దేవినేని ఉమా లేకుండానే బొమ్మ‌సాని సుబ్బారావు నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం… మాజీ మంత్రి అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇదంతా ఉమాను ప‌క్క‌న పెట్టే క్ర‌మంలో టీడీపీ అధిష్టాన‌మే వెనుకండి ఆడిస్తోంద‌న్న అనుమానాల్ని ఉమా అనుచ‌రులు వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇవాళ్టి ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మంలో స్థానికుల‌కే టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ బొమ్మ‌సాని స‌భా వేదిక‌పై నుంచి డిమాండ్ చేయ‌డం విశేషం. త‌ద్వారా ఉమాకు టికెట్ ఇవ్వొద్ద‌ని ఆయ‌న అధిష్టానాన్ని కోరిన‌ట్టైంది. గ‌త నెల 21న చ‌లో గొల్ల‌పూడి అంటూ మైల‌వ‌రం టీడీపీ కార్య‌క‌ర్త‌లంతా బొమ్మ‌సాని నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశానికి వెళ్లారు. ఆ రోజు కూడా త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని, స్థానికేత‌రుల‌కు మైల‌వ‌రంలో స్థానం లేదంటూ బొమ్మ‌సాని బ‌హిరంగంగానే అన్నారు.

బొమ్మ‌సాని కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం వుంది. బొమ్మ‌సాని తాత పెద‌ర్ల వెంక‌ట‌సుబ్బ‌య్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. అలాగే బొమ్మ‌సాని సుబ్బారావు గొల్ల‌పూడి సర్పంచ్‌గా మూడుసార్లు, ఆయ‌న తండ్రి కృష్ణ‌మూర్తి రెండుసార్లు ప‌ని చేశారు. దేవినేని ఉమాపై పార్టీలో తీవ్రమైన వ్య‌తిరేక‌త‌ను బొమ్మ‌సాని సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ పెద్ద‌ల అండ‌తోనే సుబ్బారావు మాజీ మంత్రికి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన రాజ‌కీయాన్ని చేస్తున్నారు. సొంత పార్టీలో త‌న‌కు పొగ పెడుతున్న నేప‌థ్యంలో దేవినేని ఉమా ఇదేం ఖ‌ర్మ అని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ని స‌మాచారం.