‘ఈనాడు’కు పచ్చకామెర్లు అంటే నింద కాదు నిజం!

అగ్రస్థానం తమదే అని చెప్పుకునే దినపత్రిక ఈనాడు ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేస్తూ ఉంటుందని ఎవరైనా ఆరోపిస్తే విస్తుపోవాల్సిన పనిలేదు. అది రాజకీయ ఆరోపణ అని గానీ, ఈనాడు అంటే పడక,…

అగ్రస్థానం తమదే అని చెప్పుకునే దినపత్రిక ఈనాడు ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేస్తూ ఉంటుందని ఎవరైనా ఆరోపిస్తే విస్తుపోవాల్సిన పనిలేదు. అది రాజకీయ ఆరోపణ అని గానీ, ఈనాడు అంటే పడక, ద్వేషంతో వేస్తున్న నింద అనిగానీ అనుకోవాల్సిన అవసరం లేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే.. చంద్రబాబునాయుడును గద్దెమీద కూర్చోబెట్టి తరించాలని విశ్వప్రయత్నం చేస్తున్న ఈనాడు.. ఆ క్రమంలో భాగంగా భూతద్దంలో విషయాలను చూపిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయానికి ప్రయత్నిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా జనాభిప్రాయాన్ని నిర్మించేది తామే అని నమ్మే ఈనాడు.. రెండు రాష్ట్రాల్లో ఒకే రకం పరిస్థితి ఉంటే.. ఒకే తీరుగా తన జర్నలిజం విలువలను పాటించలేకపోతోంది. 

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. విభజన తర్వాత నుంచి ఏపీ మరింత ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతోంది. ఇచ్చిన మాటకోసం లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని అమలుచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. జాగ్రత్తగా నెట్టుకొస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం అనేది ప్రతినెలా ఒకటో తేదీ కాకుండా కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం.

అయితే ఈనాడు దినపత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంటూ ఈ విషయంలో చిలవలు పలవలు చేస్తూ వార్తలు రాయడం చాలా ఘోరంగా ఉంది. ఆరోతేదీ వచ్చినా కూడా ఏపీలో ఇంకా జీతాలు ఇవ్వనేలేదంటూ.. ప్రభుత్వం పని అయిపోయిందని అన్నట్టుగా ఒక పెద్ద కథనం ప్రచురించారు. 60 శాతం మందికి జీతం అందలేదనేదే కథనంలోని సారాంశం. జీతాలు అసలు రాకపోతే ప్రభుత్వాన్ని నిందించడం అవసరమే. అయితే ప్రతినెలా క్రమం తప్పకుండా కాస్త ముందు వెనుకగా చెల్లింపులు జరుగుతూ ఉన్నా.. ఇలా రాళ్లు వేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. సరే.. అలాంటి వార్త రాయడం తప్పని చెప్పడం లేదు. కానీ.. ఒకే నీతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనుసరించాలి కదా.

తెలంగాణలో కూడా ఇంకా సగం మందికి జీతాలు రానేలేదు. కానీ.. తెలంగాణలో ఒక్క కథనం కూడా లేదు. ప్రతినెలా 7-9 తేదీల వరకు తెలంగాణలో కూడా జీతాల చెల్లింపు ఆలస్యం అవుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి వార్తా కథనాలు ఉండవు. ఏపీలో జీతాల గురించి మాత్రం.. ప్రతినెలా మొదటివారంలో ఒక రెడీమేడ్ స్టోరీ వండిపెట్టుకుని వార్చేస్తుంటారు. ఈ పోకడల్ని గమనిస్తే.. ఈనాడు అసలు ప్రజల పక్షాన పనిచేస్తోందా, తెలుగుదేశం పక్షాన పనిచేస్తోందా? అనే అనుమానం కలుగుతుంది. వారికి నిజాయితీగల విలువలు అవసరం లేదు, జగన్ పతనం మాత్రమే కావాలి, అందుకు తగినట్టుగా జగన్ మీద బురద చల్లే వార్తలు వేస్తే చాలు మరొకటి అక్కర్లేదని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది.మరి ఈనాడుకు పచ్చకామెర్లు సోకిందని ఎవరైనా సరే అనుకోకుండా ఎలా ఉంటారు?