పచ్చదళం ఎలా చెబితే అలా ఆదేశాలు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా సిద్ధపడుతున్నారా? ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికే, తద్వారా తమకు అనుకూలంగా ఉత్తర్వులు పుట్టించుకోవడానికే తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నదని, వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ నిజమేనా? తాజాగా ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలను గమనిస్తే ఎవరికైనా సరే అదే అనుమానం కలుగుతుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కొన్ని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
ఎన్నికల వ్యవహారం మొదలైన తర్వాత.. దేశవ్యాప్తంగా ఎలాంటి నిబంధనలు అమలు కావాలో, పద్ధతులు పాటించాలో సమస్తం కేంద్ర ఎన్నికల సంఘం విపులంగా నిర్దేశిస్తుంది. ఆ మేరకు పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను గత ఏడాది జులై 19 నాడే కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఆ మేరకు పోస్టల్ బ్యాలెట్ యొక్క డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి సంతకం మరియు స్టాంప్ విధిగా ఉండాలి.
అయితే ఈ ఏడాది ఏపీలో సుమారు నాలుగున్నర లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో పోలైన వాటితో పోలిస్తే లక్షన్నర దాకా ఎక్కువ. ఇందులో అనేక దొంగ ఓట్లు కూడా ఉన్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం అటెస్టింగ్ అధికారి సంతకం మరియు స్టాంపు లేకుండా కొన్ని ఫారాలు ఉండడం గమనార్హం.
ఇంకా పెద్దసంఖ్యలోని ఫారాల్లో సంతకం ఉన్నప్పటికీ స్టాంపులేదు. నిబంధనల ప్రకారం ఈ ఓట్లు చెల్లవు. హడావుడిలో ఉద్యోగులు చూసుకోలేదని, వాటన్నింటినీ కూడా చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలివ్వాలని తెలుగుదేశం రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరింది. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ తమకే పడినట్టుగా వారు క్లెయిం చేసుకుంటున్నారు.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా, అటెస్టింగ్ అధికారి స్టాంపు లేకపోయినా సరే.. సంతకం ఉంటే చాలు వాటిని పరిగణించాలంటూ సీఈవో ఆదేశాలివ్వడం జరిగింది. ఆ సంతకంపై అనుమానం వస్తే.. ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉండే సంతకాలతో పోల్చిచూసుకోవాలని కూడా చెప్పారు. ఇదంతా కేవలం తెలుగుదేశానికి మేలు చేయడం కోసం మాత్రమే విడుదల చేసిన ఆదేశాలు అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.
ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేయాలని న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. నిబంధనలకు అనుగుణంగా లేని పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు కాకుండా చూడాలని వారు కోరబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.