తెలంగాణలో రాజకీయం ఢీ అంటే ఢీ అన్నట్టు సాగుతోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు టీఆర్ఎస్, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ప్రత్యర్థులు పరస్పరం వ్యంగ్య ధోరణిలో విమర్శలు చేసుకుంటూ ప్రజానీకాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ‘సాలు దొర-సెలవు దొర’ అనే నినాదంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు చేస్తోంది.
ఈ నినాదంతో చేపట్టిన ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ‘సాలు దొర-సెలవు దొర’ ప్రకటనలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ‘సాలు దొర- సెలవు దొర’ అంటూ పోస్టర్లు ముద్రించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. నేతలను కించపరిచేలా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్ పేరుతో కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో ఆ పార్టీ నిరాశకు గురైంది.
సాలు దొర-సెలవు దొర నినాదంతో ప్రచారానికి అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై కొత్త నినాదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది.