ఏపీలో ఎన్నిక‌లు…ఎప్పుడంటే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఆ మాట‌కొస్తే దేశంలోనే రాజ‌కీయ ప‌రిణామాలు ఊహించ‌ని మ‌లుపు తిరుగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అధికార‌మే ల‌క్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ల‌కు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఆ మాట‌కొస్తే దేశంలోనే రాజ‌కీయ ప‌రిణామాలు ఊహించ‌ని మ‌లుపు తిరుగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అధికార‌మే ల‌క్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ల‌కు కాస్త సానుకూల అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో, వాటిని స‌ద్వినియోగం చేసుకోడానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తోంది. దీని ప్ర‌భావం అనివార్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప‌డ‌నుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ నెలాఖ‌రులో లేదా డిసెంబ‌ర్ మొద‌టి రెండు వారాల్లో జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అదే స‌మ‌యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా సిద్ధం కావాల‌ని వైసీపీ పెద్ద‌లు త‌మ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జ్‌ల‌కు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇస్తున్నారు.

దీంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో హుషారొస్తోంది. ఒక‌వైపు చంద్ర‌బాబునాయుడి అరెస్ట్ ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. మ‌రోవైపు వైసీపీ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. దేశంలో త‌మ‌పై కొంత వ‌ర‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని గ్ర‌హించిన బీజేపీ పెద్ద‌లు ఆరు ఐదారు నెల‌ల ముందుగా జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క బిల్లు ఆమోదించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ నెలాఖ‌రుకు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఒక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవకాశాలున్న‌ట్టు వైసీపీ పెద్ద‌లు చెబుతున్నారు. అయితే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే నిర్ణ‌యం పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వానిదే అని వారు చెబుతున్నారు. నిజానికి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల‌ల్లో లోక్‌స‌భ‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు జర‌గాల్సి వుంది. లోక్‌స‌భ‌తో పాటు దాదాపు 10 రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది.