ఆయన తెలుగుదేశం పార్టీకి పునాది నుంచి ఉన్నారు. ఎన్టీయార్ ఏరి కోరి తెచ్చి ఎమ్మెల్యేగా చేసిన సత్యం మాస్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులలో మాస్టర్ గా పనిచేసే రెడ్డి సత్యనారాయణ 1983లో అన్న గారి పిలుపు అందుకుని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు.
అనేక పర్యాయాలు మాడుగుల నుంచి గెలిచారు. మంత్రిగా కీలక శాఖలను చూసారు. ఆయన 1999లో ఓడిపోవడంతో పార్టీ నుంచి కాస్తా దూరంగా ఉంటున్నారు. ఆయన 98వ పుట్టిన రోజు తాజాగా జరుపుకున్నారు. చీడికాడ మండలం పెద గోగాడ గ్రామంలో ఆయన స్వగృహం వద్ద మాడుగుల తెలుగుదేశం సీనియర్ నాయకులు పైలా ప్రసాద్‌రావు, మాడుగుల ఇంచార్జ్ పివిజి కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులతో సహా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
నిండు నూరేళ్ళూ ఆయన జీవించాలని అంతా కోరుకున్నారు. రెడ్డి సత్యనారాయణ ఒంటి చేత్తో మాడుగుల సైకిల్ ని విజయపధంలో నడిపారు. ఆయన తెర మరుగు అయ్యాక అక్కడ టీడీపీకి విజయాలే కరవు అయ్యాయి. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ఒకసారి మాత్రమే టీడీపీ గెలిచింది. 2014, 2019లలో వైసీపీ నెగ్గింది. 2024లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఉవ్విళ్ళూరుతున్నారు.
మాడుగులలో విజయం సాధించడం ఎలా తాతా అని భీష్మాచార్యుడు లాంటి రెడ్డి సత్యనారాయణ మాస్టర్ వద్దకు తెలుగుదేశం నేతలంతా చేరి అడుగుతున్నారు. మంత్రిగా కూడా సైకిల్ మీదనే తిరిగి జన సామాన్యంలో కలిసిపోతూ విజయాలు ఎన్నో నమోదు చేసిన సత్యం మాస్టార్ స్పూర్తిని తీసుకుంటే ఎవరైనా వరస విజయాలు అందుకుంటారు. సత్యం మాస్టర్ వందేళ్ళకు పైగా జీవించాలని రాజకీయాలకు అతీతంగా అంతా కోరుకుంటున్నారు.