ఆ కుటుంబం ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది. ద్రోణంరాజు సత్యనారాయణతో సమ ఉజ్జీగా జిల్లా రాజకీయాలు నడిపీన పెతకంశెట్టి అప్పల నరసింహం టీడీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. 1983లో గెలిచినా మంత్రి పదవి అన్న గారి మంత్రివర్గంలో దక్కలేదు.
ఆ తరువాత అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన తనయుడు గణబాబు 1999 నుంచి మొదలెట్టి తాజా ఎన్నికలతో కలుపుకుని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నాలుగు సార్లలో మూడు సార్లు టీడీపీ అధికారంలో ఉంది.
తాజా ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. గణబాబు గెలిచారు. మంచి మెజారిటీతో నెగ్గిన గణబాబుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని అంటున్నారు. బలమైన బీసీ గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబుకు మంత్రి పదవి ఇస్తామన్న ప్రామిస్ కూడా ఉందిట. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని విశాఖ పశ్చిమలో గెలిచిన గణబాబు తన నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లానే అభివృద్ధి చేస్తారని అనుచరులు అంటున్నారు.
గణబాబుకు మంత్రి పదవి ఇవ్వడం అన్నది న్యాయమైనా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి చాలా టఫ్ కాంపిటేషన్ ఉంది దాదాపుగా అందరూ గెలిచేశారు. సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. అనేక సామాజిక వర్గాల వారు ఉన్నారు. మిత్రపక్షాలు జనసేన టీడీపీ ఉన్నాయి. ఈ రాజకీయ సామాజిక సమీకరణలలో గణబాబు మంత్రి పదవి అన్నది మరో జీవిత కాలం లేట్ అవుతుందా అన్నీ దాటుకుని జాక్ పాట్ కొడతారా అన్నదే ఆయన అభిమానులంతా చర్చిస్తున్న విషయం.