ఎన్నికల రాజకీయాల కోసమే కాపుల కార్డుని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీస్తున్నారు అని విశాఖ కాపునాడు నాయకులు మండిపడుతున్నారు. గత ఇరవై ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నా తనను గెలిపించిన విశాఖకు కానీ తన సామాజికవర్గానికి కనీ చేసిదేంటి అని నిలదీస్తున్నారు.
విశాఖలో ఈ నెల 26న కాపునాడు పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని వెనక గంటా ఉన్నారని ఆయన తన రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నారు అని విశాఖ కాపునాడు ప్రెసిడెంట్ తోట రాజీవ్ మండిపడ్డారు. కాపులకు వైసీపీ టీడీపీ జనసేనలో టికెట్లు ఇప్పిస్తాను అని చెప్పి గంటా తన రాజకీయం చేస్తున్నారని, కాపుల శ్రేయస్సు కోసం సభ కాకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాపు జాతి కోసం ఆవీ జీవీ ధారపోసిన మిరియాల వెంకటరావు, ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు లాంటి వారి ఫోటోలను కాపునాడు ఆహ్వాన పత్రం మీద వేయకుండా చిరంజీవి ఫోటో వేయడం వెనక గంటా వ్యక్తిగత స్వార్ధం ఉందని ఆయన విమర్శించారు.
విశాఖలో కాపుల కోసం కళ్యాణ మండపం అంటూ గంటా ఇచ్చిన హామీలకు దిక్కు లేదని, ఇపుడు కాపులను అడ్డం పెట్టుకుని రాజకీయం మాత్రం చేస్తున్నరని రాజీవ్ అంటున్నారు. మీ స్వార్ధానికి మూడు ముక్కలాట రాజకీయానికి కాపులను బలి చేయకండి అని ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు.
వంగవీటి రంగా వర్ధతి రోజున విశాఖలో సభ ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించాలి కానీ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. తనను గెలిపించిన ఉత్తర నియోజకవర్గం ప్రజలకు మూడున్నరేళ్ళుగా గంటా చేసిందేంటో తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. ఇవనీ చూస్తే ఈ నెల 26న విశాఖలో జరిగే కాపునాడు సభలో ఏమి జరగనుంది అన్నది ఆసక్తిని రేపేలా ఉంది అంటున్నారు.