నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. మొత్తం 3,295 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. విశ్వవిద్యాలయాలు, రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్ల నియామకాలపై సమీక్షిస్తున్న తరుణంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగుల భర్తీని చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా 3,295 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. విశ్వవిద్యాలయాల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అలాగే రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం అనుమతి ఇచ్చారు. ఇందులో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలన్నింటిలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు ఇవ్వడం ద్వారా విద్యా వ్యవస్థపై మరోసారి ఆయన ప్రత్యేక దృష్టిని గుర్తించొచ్చు. ఇదిలా వుండగా పోస్టులన్నీ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పోస్టులన్నీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 3, 4 వారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 10 నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేయను న్నారు. ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. ఫలితాలు విడుదలైన నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.