గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానీని ఓడించాలని చంద్రబాబు, లోకేశ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తండ్రీతనయుల్ని రాజకీయంగా చితక్కొట్టడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎవరికి వారే తోపు అంతే. బహుశా చంద్రబాబు, లోకేశ్‌లను కొడాలి, వల్లభనేని తిట్టినంతగా మరెవరూ నోరు పారేసుకుని వుండరు. అందుకే వాళ్లిద్దరినీ ఓడించాలనేది టీడీపీ పట్టుదల. ఆశ, ఆశయం అయితే ఉన్నాయి కానీ, ఆచరణ ఎలా అనేది అంతుచిక్కడం లేదు.
గుడివాడలో కొడాలి నాని ఎదురు లేని నాయకుడు. ప్రజలతో మమేకం కావడంలో కొడాలికి ఆయనే సాటి. కొడాలి నాని బూతులు మాట్లాడ్తారు, చంద్రబాబు, లోకేశ్‌లను నానా తిట్లు తిడతారనే మాటలున్నా… ప్రజల విషయానికి వస్తే, అభిమాన నాయకుడిగా పేరు పొందారు. ఇదేమీ ఊరికే రాలేదు. ప్రతిపక్షమైనా, అధికార పక్షంలో ఉన్నా కొడాలి నాని మూలాలు మరిచిపోలేదు. అందుకే గుడివాడ ప్రజల హృదయాల్లో నానికి ప్రత్యేక స్థానం.
గుడివాడను తన అడ్డాగా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. గుడివాడలో కొడాలిని ఓడించే నాయకుడు టీడీపీకి దొరకడం లేదు. ప్రస్తుతం ఇన్చార్జ్గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు అంత సీన్ లేదని చంద్రబాబు భావన. దీంతో ఆంధ్రా కాదని, అమెరికా నుంచి వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐని టీడీపీ దిగుమతి చేసుకుంది. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా వెనిగండ్ల రాము నాయకత్వాన్ని స్థానిక టీడీపీ నేతలు అంగీకరించే పరిస్థితి లేదు.
వెనిగండ్ల రాముకు గుడివాడ టికెట్ అనే సంకేతాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పరోక్షంగా ఇచ్చినప్పటికీ….పోపోవయ్యా అంటూ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, గుడివాడ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పట్టించుకోలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించతలపెట్టింది. గుడివాడలో చంద్రబాబు పర్యటన సన్నాహక సమావేశాలకు వెనిగండ్ల రామును కొనకళ్ల, రావి ఆహ్వానించలేదు.
దీంతో వెనిగండ్ల అలకబూనారు. ఈ దఫా గుడివాడ పర్యటనలో వెనిగండ్ల రాము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. అయితే స్థానికంగా ఆయనకు సహకరించే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో గుడివాడలో చంద్రబాబు పర్యటన మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
గతంలో గుడివాడలో మినీ మహానాడు నిర్వహించాలని …చివరి నిమిషంలో రద్దు చేశారు. మరోసారి అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే గుడివాడలో కొడాలిని ఓడించడం పక్కన పెడితే, టీడీపీలో కుమ్ములాటలు ఇప్పటల్లో పరిష్కారానికి నోచుకోవనేది నిష్టుర సత్యం.